
అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు
మానసిక పరిస్థితి సరిగా లేని వ్యక్తి పనిగా గుర్తింపు
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోకా హోటల్‌కు బాంబు బెదిరింపు రావడంతో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి అశోకా హోటల్‌లో బాంబు పెట్టినట్లు బెదిరించారు. వెంటనే కంట్రోల్ రూమ్ అధికారులు గోపాలపురం పోలీసులను అప్రమత్తం చేశారు. గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య, ఇన్‌స్పెక్టర్ నరేష్‌తో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తిని కరీంనగర్‌కు పెద్దపల్లికి చెందిన మీర్ మోయిష్ అహ్మద్ (45)గా గోపాలపురం పోలీసులు గుర్తించారు. నిందితుడు 20 ఏళ్ల నుంచి కుటుంబానికి దూరంగా నగరంలోని అబిడ్స్ లోని ఓ డార్మిటరీలో ఉంటున్నట్లు తేల్చారు. ఆసిఫ్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండే చుట్టాలపై కోపంతోనే బాంబు పెట్టినట్లు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment