ఆక్రమణల పర్వం! | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల పర్వం!

Feb 28 2025 9:04 PM | Updated on Feb 28 2025 9:01 PM

రెచ్చిపోతున్న అక్రమార్కులు
● సర్కారు భూములకు రక్షణ కరువు ● దర్జాగా ఆక్రమిస్తున్న కబ్జారాయుళ్లు ● రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం ● పట్టించుకోని సంబంధిత అధికారులు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఖాళీ స్థలాలే కాదు చెరువులు, కుంటలు, శ్మశానవాటికలు, పార్కులు.. కావేవీ కబ్జాకు అనర్హం అన్నట్లు ఆక్రమణదారుల చెరలోకి వెళ్లిపోతున్నాయి. పట్టాదారులు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను తమ ప్రైవేటు భూమిలో దర్జాగా కలిపేసుకుంటున్నారు. వాటికి గుట్టుగా రికార్డులు సృష్టించి, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తూ రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తుతున్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐ), తహసీల్దారులు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఆయా ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ముఖ్యంగా శంషాబాద్‌, శేరిలింగంపల్లి, మొయినాబాద్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, హయత్‌నగర్‌, బాలాపూర్‌ మండలాల్లోని సర్కార్‌ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే మెజార్టీ భూములు ప్రైవేటు వ్యక్తుల పరం కాగా, మిగిలిన కొద్ది పాటి భూములకు సైతం రక్షణ కల్పించ లేకపోతుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికులెవరైనా స్వయంగా ఫిర్యాదు చేస్తే కానీ అధికారులు కూర్చున్న కుర్చీలో నుంచి కదలడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

మచ్చుకు కొన్ని ఆక్రమణలు

● శంషాబాద్‌ మండలం పెద్దతూప్రలో 500 గజాల గ్రామకంఠం భూమి కబ్జా.

● తొండుపల్లిల సర్వే నంబర్‌ 108లో ఆరు ఎకరాలు, సర్వే నంబర్‌ 109లో 2.03 ఎకరాల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూమిలో కలిపే యత్నం.

● రాయన్నగూడ సర్వే నంబర్‌ 66లోని 6.31 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది.

● గొల్లపల్లి సర్వే నంబర్‌ 261లోని పది ఎకరాల మిగులు భూమిని ఆక్రమణకు యత్నిస్తున్నారు.

● ఔటర్‌ రింగ్‌రోడ్డు పక్కనే ఉన్న రాళ్లగూడ సర్వే నంబర్‌ 626లో రూ.వంద కోట్ల విలువ చేసే ఏడెకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్నుపడింది.

● కేశంపేట మండలం బైర్కాన్‌పల్లి గ్రామం సర్వే నంబర్‌ 53లోని డపింగ్‌యార్డ్‌ సహా నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న పట్టా భూమిలో కలిపే యత్నం.

● చేవెళ్ల మండలం కమ్మెట గ్రామం సర్వే నంబర్‌ 270లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి, చుట్టూ ప్రీకాస్టింగ్‌ పలకలను అమర్చారు.

శ్మశానవాటికలనూ వదలకుండా..

● ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు–ఎంపీ పటేల్‌గూడ మధ్యలో ప్రవహిస్తున్న పులిందర్‌వాగు 500 మీటర్ల వరకు ఆక్రమణకు గురైంది.

● ఇబ్రహీంపట్నం బొంతపల్లికుంటపై స్థిరాస్తి వ్యాపారుల కన్నుపడింది. ఇప్పటికే మట్టి పోసి కుంటను ఆక్రమించే ప్రయత్నం చేశారు.

● కుంట్లూరు పెద్ద చెరువులో రెండు ఎకరాలు కబ్జా చేసి, జీఓ నంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేసుకున్న భూమిని కాపాడాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి.

● తుర్కయంజాల్‌ సర్వే నంబర్‌ 206,216/4, 212/1, 323లలోని రెండు ఎకరాల శ్మశానవాటికను సైతం కబ్జాదారులు వదల్లేదు.

● హయత్‌నగర్‌ మండలంలోని 582 ఎకరాల ఫారెస్ట్‌ భూమిపై కూడా అక్రమార్కుల కన్ను పడింది.

● అత్తాపూర్‌ సర్వే నంబర్‌ 72 నుంచి 78 వరకు ఉన్న దేవాదాయశాఖ భూమిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement