
శానిటరీ జవాన్లకు స్థాన చలనం
బల్దియాలో 139 మంది బదిలీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో ఐదేళ్లకు పైగా ఒకేచోట పనిచేస్తున్న 139 మంది శానిటరీ జవాన్లను ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. పలువురు శానిటరీ జవాన్ల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు అని బదిలీ ఉత్తర్వులో పేర్కొన్నప్పటికీ, ఒకేచోట సుదీర్ఘ కాలంగా పాతుకుపోయినవారు చేయాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కంటే పైఆదాయానికే ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. ఇంటింటి నుంచి చెత్త తరలించాల్సిన స్వచ్ఛ ఆటో కార్మికుల్లో చాలామంది ఇళ్లకంటే హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి వచ్చే అధిక ఆదాయం కోసం వాటి కోసమే పని చేస్తున్నారు.
ఈ తతంగంలో పారిశుద్ధ్య కార్మికులపై అజమాయిషీ చెలాయించే ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లు, రెగ్యులర్ సిబ్బంది అయిన శానిటరీ జవాన్లు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని భావించి ఉన్నతాధికారులు ఇందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 269 శానిటరీ జవాన్లు ఉండగా, వారిలో ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న 139 మందిని ఇతర సర్కిళ్లకు బదిలీ చేశారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఉత్తర్వు జారీ చేశారు. ఉండాల్సిన శానిటరీ జవాన్ల కంటే కొన్ని సర్కిళ్లలో ఎక్కువగా ఉండగా, కొన్ని సర్కిళ్లలో తక్కువగా ఉండటాన్ని కూడా అధికారులు గుర్తించారు. బదిలీలతో దీన్ని సరిచేశారు.
కాగా.. వారి విజ్ఞప్తుల మేరకు నివసిస్తున్న ప్రాంతాలకు ఎక్కువ దూరం కాకుండా వీలైనంత తక్కువ దూరంలోనే పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. అదే తరుణంలో నివసిస్తున్న ప్రాంతంలోనే నియమించరాదని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో శానిటరీ జవాన్లు ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిళ్లకు ఇరుగుపొరుగు సర్కిళ్లకు బదిలీ చేశారు. జోనల్ కమిషనర్ల సహకారంతో డిప్యూటీ కమిషనర్లు పారిశుద్ధ్య జవాన్లను ఆయా వార్డుల్లో నియమించనున్నారు. రెండు పనిదినాల్లో ఈ పక్రియ పూర్తికావాలని కమిషనర్ ఆదేశించారు.