వాషింగ్టన్: ఎడమ చేత్తో కాకిని తోలరు... పిల్లికి బిచ్చం కూడా వేయరు.. సాధారణంగా పిసినారుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు వాడతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహా పిసినారి.. పిల్లికి బిచ్చం వేయదు సరికదా ఆ పిల్లి తినే ఆహారాన్నే తాను తింటుంది. అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథులకు సైతం అదే వడ్డిస్తుంది. పాపం.. ఆమె పేదవారేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆమె ఒక మల్టీ మిలియనీర్. ఆస్తి విలువ సుమారు 5.3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 38 కోట్లు). కానీ ఒక్క పైసా కూడా వృథా చేయడం ఆమెకు ఇష్టం ఉండదు. వెయ్యి డాలర్లతో నెల మొత్తం గడిపేస్తుంది. వాషింగ్ స్క్రబ్ పీలికలు అయ్యేంత వరకు ఉపయోగిస్తుంది. వంటగదిలో ఒక్క కత్తి మాత్రమే వాడుతుంది.
తనను తాను చీపెస్ట్ మల్టీ మిలియనీర్‌గా చెప్పుకొనే అమీ ఎలిజబెత్ వ్యవహారశైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘22 నిమిషాలు కాగానే వాటర్ హీటర్‌ను ఆఫ్ చేసేస్తా. అంతకు మించి క్షణం కూడా ఆలస్యం చేయను. ఎందుకంటే నీళ్లు ఎంత వేడెక్కితే నా స్నానానికి సరిపోతాయో నాకు బాగా తెలుసు. దీంతో నాకు 80 డాలర్లు ఆదా అవుతాయి. అంతేకాదు నేను క్యాట్ ఫుడ్ తీసుకుంటాను. నా ఇంటికి వచ్చేవారికి కూడా అదే పెడతాను. తద్వారా కిరాణా బిల్లు తగ్గిపోతుంది. ’’ అని అమెరికాలోని లాస్ వేగాస్‌కు చెందిన అమీ టీఎల్‌సీతో మాట్లాడుతూ తన జీవన విధానం గురించి చెప్పుకొచ్చారు.(చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!)
అంతేకాదు పాత వస్తువులతోనే కాలం నెట్టుకొస్తానని, తద్వారా కొత్తవి కొనేందుకు ఏటా అవసరమయ్యే సుమారు 2 లక్షల డాలర్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇక అమీ మాజీ భర్త మైఖేల్ ముర్రే ఇంటి పనులన్నీ చేస్తారు. దీంతో పనిమనిషికి ఇవ్వాల్సిన 400 డాలర్లు ఆమెకు మిగిలిపోతున్నాయట. ఇక ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేసే అమీ, 17 ఏళ్ల కాలం నాటి కారునే వాడతారు. డబ్బు పొదుపు చేసేందుకే తాను ఈ మార్గాలు ఎంచుకున్నానని, ఎవరు ఏమనుకున్నా తను అసలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. అమీకి సంబంధించిన ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment