చైనాతో కలిసి పనిచేయడానికి సిద్ధం: బైడెన్‌ | America Is Back Said US President Joe Biden | Sakshi
Sakshi News home page

అమెరికా ఈజ్‌ బ్యాక్‌: జో బైడెన్‌

Published Sat, Feb 6 2021 10:07 AM | Last Updated on Sat, Feb 6 2021 12:11 PM

America Is Back Said US President Joe Biden - Sakshi

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో ప్రపంచ దేశాలతో క్షీణించిన సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పారు. అమెరికా ఈజ్‌ బ్యాక్‌ అని ప్రకటించారు. అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేశాక గురువారం తొలిసారిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలిసి విదేశాంగ శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న బైడెన్‌ తాను అనుసరించబోయే విదేశాంగ విధానాన్ని, లక్ష్యాలను వారితో పంచుకున్నారు. అంతర్జాతీయంగా అగ్రరాజ్యాన్ని తిరిగి బలోపేతం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం హయాంలో మిత్రదేశాలు, భాగస్వామ్య పక్షాలతో ఏర్పడిన విభేదాలను తొలగించుకొని, అంతర్జాతీయంగా తిరిగి విశ్వసనీయతను, నైతికతను పెంచుకునే విధంగా విదేశాంగ విధానం ఉంటుందని అన్నారు. చదవండి: మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది

అయితే ఇదంతా ఒంటరిగా చేయలేమన్న బైడెన్‌ మిత్రపక్షాలతో కలసికట్టుగా ముందుకు అడుగు వేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘ప్రపంచదేశాలు నా ఈ మాట వినాలి. అమెరికా ఈజ్‌ బ్యాక్, అమెరికా ఈజ్‌ బ్యాక్, మా విదేశాంగ విధానంలో దౌత్యానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది’’అని చెప్పారు. నిన్నటి సవాళ్లతో మనకి పని లేదు, ఇవాళ,. రేపు ఎదురయ్యే సమస్యలనే మనం పరిష్కరించుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి వాతావరణంలో మార్పులు, అణ్వాయుధ వ్యాప్తి నిరోధం వంటి అంతర్జాతీయ సవాళ్లను అందరూ కలసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని బైడెన్‌ అన్నారు. 

చైనా, రష్యాలతో
అమెరికాని ఢీ కొట్టాలని చూసే చైనా, మన దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని గట్టి పట్టుదలతో ఉండే రష్యాలకు గట్టి పోటీ ఇవ్వడానికి అందరూ సన్నద్ధంగా ఉండాలని బైడెన్‌ పిలుపుని చ్చారు. ఆ రెండు దేశాలతో దూకుడుగా ముందుకు వెళతామన్న సంకేతాలు ఇచ్చారు. చైనా అత్యంత తీవ్రమైన పోటీదారు అని అభివర్ణించారు. మానవ హక్కులు, ఆర్థిక విధానాలు, మేధో సంపద వంటి అంశాల్లో ఆ దేశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. అయితే అమెరికా ప్రయోజనాలను కాపాడడానికి డ్రాగన్‌ దేశం ముందుకు వస్తే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బైడెన్‌ స్పష్టం చేశారు. జర్మనీలో అమెరికా దళాలు కొనసాగుతాయని, ఏడాదికి లక్షా 25 వేల మంది శరణార్థుల్ని దేశంలోకి అనుమతిస్తామని చెప్పారు. యెమన్‌లో సౌదీ అరేబియా ఆధ్వర్యంలోని మిలటరీకి మద్దతు ఉపసంహరిస్తున్నట్టుగా చెప్పారు. మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సైన్యాన్ని అభ్యర్థించారు. 

దౌత్యంతోనే ముందుకు అడుగులు
అమెరికా ప్రజాస్వామ్య విలువలు మరింత పెరిగేలా, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని సమర్థిస్తూ, విశ్వమానవ హక్కులకి మద్దతునిస్తూ , ప్రతీ వ్యక్తి మర్యాదని కాపాడుతూ, ప్రతీ దేశంలో చట్టాలను గౌరవిస్తూ ప్రపంచ దేశాల మధ్య తలెత్తుకు నిలబడాలన్నదే తన లక్ష్యమని అన్నారు. ట్రంప్‌ హయాంలో దెబ్బ తిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి గత కొద్ది రోజులుగా కెనడా, మెక్సికో, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్‌ వంటి దేశాధినేతలతో మాట్లాడానని చెప్పారు. అమెరికా ప్రజల భద్రత కోసం మన పోటీ దారుల్ని కూడా దౌత్యపరంగానే కట్టడి చేయాలన్నారు. పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరడం, కరోనాపై పోరాటానికి డబ్ల్యూహెచ్‌ఒతో చేతులు కలపడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు బైడెన్‌ వివరించారు. 

కలిస్తే చాలా చేయగలం : చైనా
చైనా విసిరే సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంత వరకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యల తీవ్రతను చైనా తగ్గించి చూపించే ప్రయత్నం చేసింది. రెండు దేశాలు కలిసికట్టుగా పని చేస్తే చాలా పనులు చేయవచ్చునని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం రెండు దేశాలు చేతులు కలపాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement