
మరో మేధావి జీవితం విషాదంగా ముగిసింది. మెక్‌అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్‌అఫీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అమెరికాలో పన్నుల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న మెక్‌అఫీ.. కిందటి ఏడాది అక్టోబర్ నుంచిస్పెయిన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం ఆయన తన గదిలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
బార్సిలోనా: డెబ్భై ఐదేళ్ల మెక్‌అఫీ.. అమెరికన్ టెక్నాలజీ ఎంట్రెప్రెన్యూర్‌గా పేరుగాంచాడు. 80వ దశకంలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ మెక్ అఫీని కనిపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడాయన. అయితే టెన్నెస్సెలో పన్నుల ఎగవేత, న్యూయార్క్‌లో క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి.ఈ ఆరోపణల కేసులో అమెరికా నుంచి పారిపోయిన ఆయన్ని.. కిందటి ఏడాది అక్టోబర్‌లో స్పెయిన్ పోలీసులు అరెస్ట్ చేసి బార్సిలోనా జైలుకి తరలించారు.
ఇక పన్నుల ఎగవేత ఆరోపణల కేసులో మెక్‌అఫీని అమెరికాకు అప్పగించే స్పెయిన్ కోర్టు బుధవారం నాడే కీలక తీర్పు వెలువరించింది. ఆయన్ని అమెరికాకు అప్పగించాలని స్పెయిన్ పోలీసులను ఆదేశించింది. ఈ తరుణంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ‘అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉన్నా.. జైల్లో మగ్గేందుకు ఆయన మనసు అంగీకరించలేదు. సొసైటీ ఆయన మీద పగ పట్టింది’ అని ఆయన తరపు లాయర్ జవెయిర్ మీడియా ముందు భావోద్వేగంగా మాట్లాడాడు.
2011లో తన కంపెనీని ఇంటెల్‌కు అమ్మిన మెక్‌అఫీ.. ఆ తర్వాత వ్యాపారాలకు దూరంగా ఉంటూ విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ వచ్చాడు. లోగడ తాను 48 మంది పిల్లలకు తండ్రి చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. 2012లో పొరుగింటి వ్యక్తి హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ నుంచి తప్పించుకునేందుకు పారిపోయాడు. తన సిద్ధాంతాలకు విరుద్ధంగా పన్నులు కట్టలేనని చెబుతూ.. కొన్ని ఏళ్లపాటు పన్నులు చెల్లించలేదు. ఒకానొక టైంలో క్యూబా సాయంతో అమెరికా అధ్యక్ష బరిలో పోటీ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ట్విటర్‌లో ఆయన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఒక మేధావి జీవితం ఇలా విషాదంగా ముగియడంపై ఆయన అభిమానులు కలత చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment