ఉక్రెయిన్‌పై యుద్ధం.. చాలా దేశాలతో రష్యా సంబంధాలను దూరం చేస్తోంది. తాజాగా.. యుద్ధ నేరస్తుడనే ట్యాగ్ పుతిన్‌కు తగిలించి జీ20 సమావేశాల నుంచి రష్యాను పక్కనపెట్టాలంటూ అమెరికా డిమాండ్ లేవనెత్తిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఆస్ట్రేలియా సైతం పుతిన్ వ్యతిరేక గొంతుకే వినిపిస్తోంది.
జీ20 సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆహ్వానం పంపడం, ఇతర దేశాల నేతలతో కలిసి కూర్చోనివ్వడంపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘రష్యా తన పొరుగున ఉన్న ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తోంది. ఇది క్రూరమైన చర్య. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చేష్టలే ఇదంతా’’ అంటూ గురువారం మెల్‌బోర్న్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు మోరిసన్. అలాంటి దురాక్రమణకు కారణమైన పుతిన్ పక్కన కూర్చోవడం అంటే.. నా దృష్టిలో అది చాలా దూరం వెళ్లినట్లే అవుతుంది అంటూ పుతిన్ రాకను నేరుగానే వ్యతిరేకించారాయన.
ఇదిలా ఉండగా.. అక్టోబర్ చివరి వారంలో(లేదంటే నవంబర్ మొదటి వారం) ఇండోనేషియా బాలిలో జరగబోయే జీ20 సదస్సుకు ఇప్పటికే పుతిన్‌కు ఆహ్వానం అందింది. ఆయన హాజరు కానున్నరారనే విషయాన్ని ఇండోనేషియాలోని రష్యా దౌత్యవేత్త ధృవీకరించారు కూడా.
మరోవైపు రష్యాను జీ20 నుంచి బహిష్కరించాలన్న అమెరికా డిమాండ్‌ను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. కీలక సభ్యత్వం ఉన్న రష్యాను అంత సులువుగా ఎవరూ బహిష్కరించలేరని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ విషయంపై ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోతో నేరుగా చర్చిస్తానని అంటున్నారు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్.
మరోవైపు.. ఉక్రెయిన్ యుద్ధం నేటితో నెలరోజులు పూర్తి చేసుకుంది. ఆంక్షల్లో భాగంగా.. రష్యాపై మొత్తం 476 ఆంక్షల్ని విధించింది ఆస్ట్రేలియా. అంతేకాదు.. జులై 17, 2014 ఎంహెచ్ 17 మలేషియా ఎయిర్‌లైన్స్ విమాన ప్రమాదం వెనక రష్యా పాత్రపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లు మరోసారి న్యాయపరమైన చర్యలకు దిగనున్నాయి. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నివేదిక ప్రకారం.. ఉక్రెయిన్ గగనతలం నుంచి వెళ్తున్న ఆ విమానంపై రష్యా ప్రయోగించిన మిస్సైల్ వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ ఆక్రమణను ప్రస్తావిస్తూ.. అమాయకుల ప్రాణాలను బలి తీసుకునే తత్వం పుతిన్‌ది అని ఆనాడే స్పష్టమైంది అంటూ ఆస్ట్రేలియా ప్రధాని మోరిస్ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment