జఫ్ఫాకేక్స్... అవేం కేక్స్ అని నవ్వుకుంటున్నారా? మీరు సరిగ్గానే విన్నారు. పేరు డిఫరెంట్‌గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్. బ్రిటిష్ కేక్స్ కంపెనీ మెక్‌విటీ తయారు చేసే ఈ ఆరెంజ్ కేక్స్, డార్క్ ఫాంటసీ బిస్కెట్ సైజ్‌లో ఉంటాయి. అయితే దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్. అంత చిన్న సైజ్‌లో ఉండే కేక్‌ను ఫ్లేవర్, రుచి ఏమాత్రం పోకుండా... 80 కిలోల కేక్ తయారు చేసింది చెఫ్ ప్రాన్సిస్ క్విన్. అంటే దాదాపు 6,557 చిన్న కేకులు కలిపినంత ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జఫ్ఫాకేక్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది.
అత్యంత పెద్ద జఫ్ఫాకేక్ తయారు చేసి... 2017లో తాను నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్ చేసింది క్విన్. కేక్స్ తయారు చేయడంలో నిపుణురాలైన ఆమె... 2013లో ‘ద గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్’లో విజేతగా నిలిచింది. 80 కిలోల బరువు, దాదాపు రెండు మీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ కేక్ తయారీ కోసం 160 గుడ్లు, 8 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల ఆరెంజ్ జెల్లీ ఉపయోగించింది. కేక్ మిక్సింగ్ దగ్గర్నుంచి బేకింగ్ వరకు 11 గంటల సమయం పట్టింది. జప్ఫాకేక్‌కు అసలైన రుచి రావడం కోసం ఆ కేక్స్ కంపెనీ ‘మెక్‌విటీ’ సిబ్బంది కూడా క్విన్‌కు సహాయం చేశారు. ఇదంతా ఓకే అసలు ఆ కేక్‌కు జఫ్ఫా అనే పేరు ఎందుకొచ్చిందనేగా మీ డౌట్. జఫ్ఫా ఆరెంజెస్‌తో చేసిన కేక్ కాబట్టి జఫ్ఫా కేక్ అని పిలుస్తారు. ఈ జఫ్ఫా ఆరెంజెస్ అరబ్ రైతుల 19వ శతాబ్దపు సృష్టి. ఈ ఆరెంజెస్ తక్కువ గింజలు, ఎక్కువ గుజ్జు, మందపాటి పీల్‌తో ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment