బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లకు సంబంధించిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. తన సోదరి షేక్ రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ప్రస్తుతం దేశం మొత్తాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకుంది. నేటి రాత్రి లోపు దేశంలో పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ ప్రకటించారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలోనే బంగ్లాదేష్ ప్రధాని పదవి నుంచి 76 ఏళ్ల షేక్ హసీనా దిగిపోయినట్లు తెలుస్తోంది. ఆమె పదవి నుంచి దిగిపోయేందుకు 45 నిమిషాల సమయం ఇచ్చినట్లు.. క్రమంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తీవ్ర ఆందోళనలతో ఢాకాలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని సెక్యూరిటీ ఆదేశించడంతో ఆగమేఘాల మీద దేశం విడిచి వెళ్లినట్లు వినికిడి.
భారత్‌లో షేక్ హసీనా..
అయితే షేక్ హసీనా భారత్‌కు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఇది యూపీలోని ఘజియాబాద్‌లో ఉంది. అక్కడ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు.
అనంతరం ఆమె లండన్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీఇ వివరించారు. అయితే మోదీ హసీనాను కలుస్తారో లేదన్న విషయంపై స్పష్టత లేదు.
బీఎస్‌ఎఫ్ అలెర్ట్..
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత సరిహద్దులను రక్షించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. తాజా పరిస్థితి నేపథ్యంలో ముందస్తు చర్యల కోసం బీఎస్‌ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు పొరుగు దేశంలోని పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్‌తో అన్ని రైళ్ల సేవలను నిలిపివేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment