బంగ్లాదేశ్‌లో చెలరేగిన నిరసనలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడం ఆ దేశం అల్లకల్లోలంగా మారింది. ఈ అల్లర్లతో ఒక్క వారంలోనే ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లడం, నిరసనకారులు రెచ్చిపోయి షాపులు, బంగ్లాలు తగలబెట్టడం.. ఆర్మీ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేయడం ఇలాంటి ఎన్నో పరిస్థితులు వెలుగుచూశాయి.
అయితే ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక చైనా, పాకిస్తాన్, తాజాగా అగ్రరాజ్యం కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా చెబుతున్నారు. దేశంలో నిరసనలకు, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆమె ఆరోపనలు చేశారు. బంగ్లా వదిలి వెళ్లే ముందు దేశ ప్రజల్ని ఉద్దేశించి హసీనా మాట్లాడాలని అనుకున్నప్పటికీ, అక్కడి సైన్యం అందుకు అనుమతించలేదు. వీటన్నింటికి అమెరికాకు ‘సెయింట్ మార్టిన్స్’ ద్వీపాన్ని ఇవ్వకపోవడమే కారణమని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది.
బంగాళాఖాతంలోని ఈశాన్య భాగంలో ఉంది ఈ సెయింట్ మార్టిన్ ద్వీపం. ఇది ఒక చిన్న పగడపు భూభాగం. బంగ్లాదేశ్ కాక్స్ బజార్-టెక్నాఫ్ కొనకు దక్షిణాన దాదాపు 9 కి.మీ దూరంలో ఈ దీవి ఉంది. దాదాపుగా 3700 మంది జనాభా ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరు చేపలు పట్టడం, వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. వరిసాగు చేస్తూ మయన్మార్‌కు ఎగుమతి చేస్తుంటారు.
ఈ ద్వీపం ఎలా ఏర్పడింది?
18వ శతాబ్ధంలో ఈ ద్వీపంలో అరబ్ వర్తకులు స్థిరపడి దీనికి జజీరా అనే పేరు పెట్టారు. స్థానికులు నారికెల్ జింజిరా లేదా కొబ్బరి ద్వీపం అని కూడా పిలుస్థారు. తరువాత 1900ల్లో ఈ ద్వీపాన్ని ఇంగ్లాండ్ వాళ్లు బ్రిటిష్ ఇండియాలో భాగం చేసుకొన్నారు. క్రిస్టియన్ గురువు సెయింట్ మార్టిన్ పేరును ఈ ద్వీపానికి పెట్టారని చెబుతారు. 1947లో భారత్ విడిపోయిన తర్వాత ఇది తూర్పు పాకిస్థాన్‌లో భాగమైంది. 1971 తర్వాత బంగ్లాదేశ్‌కు దక్కింది.
1974లో దీనిపై బంగ్లా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ మయన్మార్- బంగ్లాదేశ్ ఒప్పందం కూడా చేసుకొంది. తరువాత 2012లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ (ITLOS) ద్వారా ఈ ద్వీపంపై బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని గుర్తించింది. అయితే ఇక్కడ సముద్ర సరిహద్దుల గుర్తింపు పూర్తికాలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్ మత్స్యకారుల పడవలపై మయన్మార్ దళాలు కాల్పులు జరపడం పరిపాటిగా మారింది.
సెయింట్ మార్టిన్ ద్వీపం బంగ్లాదేశ్‌కు కీలకమైన ఆర్థిక, పర్యావరణ ఆస్తిగా ఉంది. ఈ ద్వీపం బంగ్లాదేశ్ ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలోకి వస్తుంది. ఇది చేపలు, చమురు, గ్యాస్ వంటి విలువైన సముద్ర వనరుల వెలికితీతకు ఉపయోగపడుతోంది. ఈ ద్వీపం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. దాని సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక వారసత్వంతో సందర్శకులను ఆకర్షిస్తుంది.
హసీనా ఆరోపణలతో హాట్‌టాపిక్‌గా మార్టిన్ ద్వీపం..
ప్రస్తుతం ఈ చిన్న దీవి హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఇటీవల షేక్ హసీనా చేసిన ఆరోపణలే కారణం. రాజకీయ మద్దతు కోసం అమెరికా ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని, కానీ తాను అంగీకరించలేదని తెలిపింది. సెయింట్ మార్టిన్ ద్వీపంపై. సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే.. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో తాను అధికారంలో ఉండేదాన్నని పేర్కొన్నారు.
ఈ ద్వీపం యమన్మార్‌కు దగ్గరగా ఉంటుంది. వివిధ దేశాల మధ్య సముద్ర మార్గాలకు కీలకంగా వ్యవహరిస్తోంది. బంగాళా ఖాతంలో పలు దేశాల మధ్యలో ఉండటంతో అగ్రరాజ్యం అమెరికా దృష్టి దీనిపై ఎప్పటి నుంచో ఉన్నట్లు వినికిడి. కానీ ఈ ద్వీపంపై తమకు ఆసక్తి లేదని పలుమార్లు అమెరికా అధికారికంగా చెబుతూ వస్తోంది. తాజాగా సైతం మార్టిన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవలనే ఆలోచన తమకు ఎప్పుడూ లేదని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతనిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు.
కానీ మార్టిన్ ద్వీపంలో అమెరికా తమ స్థావరం ఏర్పాటుకు చాలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. సముద్ర మార్గం ద్వారా ప్రపంచ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైన మలక్కా జలసంధిపై నేరుగా కలుపుతుంది. కనుక ఈ ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తే మలక్కాజలసంధి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు వీలవుతుందని అగ్రరాజ్యం జభావించినట్లు సమాచారం.
దీనికి సమీపంలో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. దీనికి సమీపంలోని ఈ ద్వీపంలో స్థావరం ఉంటే నిఘాకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని అగ్రరాజ్యం భావిస్తోంది. దీంతోపాటు ఏకకాలంలో ఇక్కడి నుంచి చైనా, మయన్మార్‌పై నిఘా పెట్టేందుకు అవకాశం లభిస్తుంది. అందుకే దీనిని దక్కించుకునేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు, అక్కడ స్థావరం ఏర్పాటుకు చాలా యత్నాలు చేసినట్లు తెలుస్తోంది.. అప్పటి నుంచి ఈ అంశం పలుమార్లు తెరపైకి వస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment