వాషింగ్టన్ : అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ.. ప్రతి పక్షాలు ఎదురు దాడికి దిగుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ అధక్షుడు బరాక్ ఒబామా రిపబ్లిక్ పార్టీ అధినేత, అగ్ర రాజ్యం అధ‍్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శల దాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను తిరిగి ఎన్నుకుంటే అమెరికన్ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఈ ఏడాది నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ పార్టీ తరపున జో బిడెన్ నామినేట్ అయ్యారు. బిడెన్.. ప్రస్తుత ప్రెసిడెంట్ పోరులో డొనాల్డ్ ట్రంప్కు పోటీగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి కమలా హారిస్ నామినేషన్ స్వీకరించారు. (చరిత్ర సృష్టించిన కమలా హారిస్)
ఈక్రమంలో డెమొక్రాట్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఒబామా మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్ పాలనా విధానాన్ని ఖండించారు. ట్రంప్ గెలిస్తే అమెరికా ప్రజాస్వామ్యం కూలిపోతుందని ప్రస్తుతం సాగుతున్న పాలన చూస్తే అర్థమవుతుందన్నారు. త్రివిధ దళాల అధిపతి, అధ్యక్షుడు ట్రంప్ దేశం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అమెరికన్ ప్రజాస్వామ్యానికి అస్తిత్వ ముప్పును కలిగిస్తున్నారని విమర్శించారు. శ్వేతసౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియస్‌గా చేస్తారనుకున్నాం, కానీ ఆయన పాలన నిర్లక్ష్యంగా ఉన్నట్లు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా ప్రతిష్టకు భంగం కలిగిందని, ట్రంప్ పాలనతో దేశంలోని యువత నిరాశలో ఉన్నారని ఒబామా అన్నారు. (బైడెన్ అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన)
దేశ పౌరులుగా బాద్యత వహించి ప్రజాస్వామ్యాన్ని రక్షించే నాయకున్ని ఎన్నుకోవాలని ఒబామా పిలుపునిచ్చారు. రాబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో జోసెఫ్ బైడెన్‌కు ఓటు వేయాలని ఆమె అమెరికన్లను కోరారు. బైడెన్ దేశాధ్యక్షుడు అయితే.. దేశ ప్రజలందరినీ ఆయన ఒక్కటి చేస్తారన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. ఒబామా విమర్శలను తిప్పికొట్టారు. గత ప్రభుత్వం మంచి పరిపాలన అందించి ఉంటే ప్రస్తుతం తాను అద్యక్షుడిని అయ్యుండే వాడిని కాదని అన్నారు.కాగా ఒబామాకు, మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్‌తో వైట్‌హౌజ్‌లోపాటు వ్యక్తిగతంగా ఎనిమిది సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉంది. కాగా నవంబరు 3న జరగనున్న ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కంటే జో బిడెన్ ముందంజలో ఉన్నారు. ప్రధానంగా మహిళా ఓటర్లలో ఆధిక్యతను చాటుకుంటున్నారు. (ట్రంప్ అంతకుమించి ఏమీ చేయలేరు!)
Comments
Please login to add a commentAdd a comment