టెల్ అవీవ్: యుద్ధక్షేత్రంలో ముందుకు దూసుకెళ్తున్న ఇజ్రాయెల్ సైనిక బలగాలకు సూచనలు చేసే కీలకమైన వార్ కేబినెట్‌ను సోమవారం ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అనూహ్యంగా రద్దుచేశారు. దీంతో గాజాస్ట్రిప్‌లో సైనికులు అనుసరించాల్సిన వ్యూహాలు, వారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ తుది నిర్ణయాలను ఇకపై ఎవరు తీసుకుంటారన్న దానిపై సర్వత్రా చర్చ నెలకొంది.
విపక్ష నేతలు ఈ యుద్ధ మండలి నుంచి వైదొలగడమే వార్ కేబినెట్ నిర్వీర్యానికి అసలుకారణమని తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లు మెరుపుదాడి చేసి 1,200 మంది ఇజ్రాయెలీలను పొట్టనబెట్టుకోవడంతో ఇజ్రాయెల్‌లోని విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. గాజా స్ట్రిప్‌పై దురాక్రమణకు తెగబడిన ఇజ్రాయెల్ సేనలకు బాసటా నిలిచాయి.
దేశంపై దాడి నేపథ్యంలో రాజకీయపక్షాల మధ్య ఐక్యత ఉందని చాటుతూ ప్రభుత్వానికి మద్దతుపలుకుతూ నెతన్యాహూ ఏర్పాటుచేసిన వార్ కేబినెట్‌లో సభ్యులుగా నెతన్యాహూకు బద్దశత్రువులైన విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు చేరారు. గాంట్జ్, నెతన్యాహూ, రక్షణ మంత్రి మొఆవ్ గాలంట్‌లు వార్ కేబినెట్‌లో కీలక సభ్యులుగా ఉండేవారు.
అయితే ఇటీవలి కాలంలో యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడుతోందని వేలాది మంది అమాయక పాలస్తీనియన్లను చంపేస్తోందని ప్రపంచదేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా సైతం పౌరనష్టంలేని సైనిక చర్యకే మొగ్గుచూపింది.
బందీలను విడిపించడంపై దృష్టి సారించాల్సింది పోయి హమాస్ అంతం తమ లక్ష్యమన్నట్లు ఇజ్రాయెల్ సేనలు వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు బెన్నీ గాంట్జ్ తదితరులు నెతన్యాహూ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణకు నెతన్యాహూ ససేమిరా అనడంతో యుద్ధరీతులు మారిపోయాయని భావించి బెన్నీ తదితరులు కేబినెట్ నుంచి వైదొలిగారు.
Comments
Please login to add a commentAdd a comment