
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోటి దురుసు ప్రదర్శించారు. ఐరాస భేటీ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌కు ఒక విషయం చెప్పదల్చుకున్నా. లాడెన్ చచ్చిపోయాడు గానీ గుజరాత్ ప్రజల ప్రాణాలను బలి తీసుకున్న కసాయి బతికే ఉన్నాడు. ఆయనే భారత ప్రధాని. ఆయన్ను అమెరికాలో అడుగుపెట్టకుండా అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఆయన ఆరెస్సెస్ ప్రధాని. ఆరెస్సెస్ విదేశాంగ మంత్రి.
అసలు ఆర్‌ఎస్‌ఎస్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొందింది!’’ అన్నారు. బిలావల్ తొలుత ఐరాస భేటీలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌కు, భారత పార్లమెంట్‌పై దాడి చేసిన ముష్కరులకు ఆశ్రయమిచ్చిన పాక్‌కు నీతి బోధలు చేసే అధికారం లేదంటూ విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. ఈ విమర్శలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మోదీపై బిలావల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవి అనాగరికంగా, పాక్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉన్నాయంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా ఖండించారు. 1971లో ఏం జరిగిందో బిలావల్ మర్చిపోయినట్లున్నారని భారత్ చేతిలో పాక్ ఓటమిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment