Bill Gates Daughter Jennifer Gates’s Elegant Wedding to Nayel Nassar- Sakshi
Sakshi News home page

Bill Gates Daughter Jennifer Wedding: బిల్‌ గేట్స్‌ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే..

Published Tue, Oct 19 2021 11:40 AM | Last Updated on Wed, Oct 20 2021 2:53 PM

Bill Gates Daughter Jennifer Vogue Interview About Her Wedding - Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే పెళ్లి వేడుకలే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి అలాంటిది ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌ ఇంట పెళ్లి అంటే.. మాటలు కాదు. అతిరథ మహరథులు అతిథులుగా హాజరయ్యే ఈ వేడుకకు ఖర్చు మాములుగా ఉండదు. మన ఆసియా కుబేరుడు ముకేష్‌ అంబానీ ఆయన కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుకకు సుమారు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాచారం.

మరి ప్రపంచ కుబేరుడు బిల్‌ గేట్స్‌ కుమార్తె వివాహం అంటే ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నారా.. అయితే అక్కడే మీరు పప్పులో కాలేసినట్లు. బిల్‌గేట్స్‌ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్‌ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. 


(చదవండి: ప్రియుడితో బిల్‌గేట్స్‌ తనయ జెన్నీఫర్‌ పెళ్లి!)

కొన్ని  రోజుల క్రితం బిల్‌ గేట్స్‌ కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహం జరిగినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన ‘పీపుల్‌’ మ్యాగజైన్‌ ధృవీకరించింది. పెళ్లి అనంతరం జెన్నీఫర్‌ గేట్స్‌  తన వివాహ వేడుక గురించి వోగ్‌ మ్యాగ్‌జైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘2021 నాకు చాలా సవాళ్లు విసిరిన సంవత్సరం. ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. బయటకు వెళ్లడానికి అవకాశం లేకుండా అయిపోయింది. దానికి మించిన సంఘటన మా ఇంట్లోనే చోటు చేసుకుంది. దురదృష్టం కొద్ది ఈ ఏడాదే మా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితులు మధ్య పెళ్లి వేడుకను ప్లాన్‌ చేయడం చాలా సవాలుతో కూడుకున్న పని అయ్యింది’’ అని తెలిపింది జెన్నీఫర్‌. 


(చదవండి: ఈ పెళ్లి చరిత్రలో నిలిచిపోతుంది.. ఎందుకంటే!)

‘‘ఇక పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్‌ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి చేశాం. నెగిటివ్‌ రిపోర్ట్‌ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్‌ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది.

‘‘శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. ప్రఖ్యాత న్యూయార్క్ సిటీ రెస్టారెంట్లు క్యాటరింగ్‌ చేశాయి. కస్టమ్ వెరా వాంగ్ డిజైన్‌ చేసిన వెడ్డింగ్‌ గౌను ధరించాను. ఈవెంట్ ప్లానర్ మార్సీ బ్లమ్ వారాంతంలో ఈ వేడుక జరిపించారు’’ అన్నది. 

జెన్నీఫర్‌ భర్త నాయల్‌ నాజర్‌ ఈక్వెస్ట్రియన్‌(గుర్రపు స్వారీ)లో పాల్గొన్నాడు. ఈజిప్టు సంతతికి చెందిన నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో ఉన్నారట. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్నపటి నుంచే ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. గేట్స్‌ దంపతులు విడిపోవడంతో.. కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నారు. బిల్‌గేట్స్‌.. కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ఒకరోజు ముందుగా హాజరయ్యారు. 

చదవండి: గోల చేయని భార్య! ప్చ్‌.. నాలుగు రోజులకే విడాకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement