Peshawar Explosion:పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లో.. అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పెషావర్ నగరంలో ఉగ్రవాదులు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 194 మంది గాయాల పాలయ్యారు. ఖైబర్–పఖ్తూంక్వా ప్రావిన్స్‌లో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద ఉగ్ర దాడుల్లో ఇది కూడా ఒకటని అధికారులు చెప్పారు. పెషావర్‌లోని ఖిస్సా ఖ్వానీ బజార్ ఏరియా సమీపంలో ఇమామ్‌బర్గా వద్ద షియా వర్గానికి చెందిన జామియా మసీదులో పేలుడు జరిగిందని తెలిపారు.
ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థే కారణమని నిర్ధారణకు వచ్చారు. షియావర్గం ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఐసిస్ కొంతకాలంగా భీకర దాడులకు పాల్పడుతోంది. జామియా మసీదులో పేలుడు ఘటనలో ఉగ్రవాదులు పాల్గొన్నారని ఖైబర్–పఖ్తూంక్వా ప్రభుత్వ అధికార ప్రతినిధి బారిస్టర్ మొహమ్మద్ అలీ సైఫ్ చెప్పారు. ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాల్గొన్నప్పటికీ.. వారిలో ఒక్కడు మాత్రమే ప్రార్థనలు జరుగుతున్న సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి హరూన్ రషీద్ ఖాన్ తెలిపారు. నల్ల రంగు దుస్తులు ధరించిన వ్యక్తిని సూసైడ్ బాంబర్‌గా ఓ ప్రత్యక్ష సాక్షి గుర్తించారు. సదరు ముష్కరుడు తొలుత మసీదు సెక్యూరిటీ గార్డును తుపాకీతో కాల్చి చంపాడని, తర్వాత మసీదు లోపలికి ప్రవేశించి, తనను తాను పేల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
జామియా మసీదులో ఆత్మాహుతి పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. పెషావర్‌లో పేలుడు ఘటనపై పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను బలిగొన్న దుర్మార్గులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామని ఖైబర్–పఖ్తూంక్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రార్థనల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడం అమానవీయం, రాక్షస కృత్యం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment