ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన.
ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్‌లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు.
చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు.
ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం!
Comments
Please login to add a commentAdd a comment