గతేడాది కాలీఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు
వాషింగ్టన్: గతేడాది అగ్రరాజ్యం అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని ఎల్ రాంచ్ డొరాడో పార్కులో భారీ కార్చిచ్చు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 23 వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సెప్టెంబర్ 5, 2020 న శాన్ బెర్నార్డినో కౌంటీలో చెలరేగిన కార్చిచ్చు సుమారు 23 రోజుల పాటు కొనసాగింది. ఈ ప్రమాదంలో పలు ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు ఓ అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. ఈ క్రమంలో ఈ కార్చిచ్చుకు కారణమైన జంటపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..
పార్టీలో తలెత్తిన ప్రమాదం..
అమెరికా ఎల్ రాంచ్ డొరాడో పార్కు సమీపంలో రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట జెండర్ రివీల్ పార్టీ(పుట్టబోయే బిడ్డ ఆడా, మగా తెలిపే పార్టీ) ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో బ్లూ, పింక్ కలర్‌లో పొగలను రిలీజ్ చేసే పైరోటెక్నిక్ డివైజ్‌లను పేలుస్తుంటారు. బ్లూ కలర్ పొగ వస్తే మగ బిడ్డ అని, పింక్ కలర్ పొగ వస్తే ఆడపిల్ల అని అర్థం. ఈ క్రమంలో జిమెనెజ్ జంట వీడియో తీస్తూ.. డివైజ్ పేల్చడంతో పొగకు బదులుగా మంటలు వచ్చాయి.
వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసినా.. లాభం లేకపోయింది. అప్పటికే మంటలు అదుపు తప్పి భారీగా విస్తరించాయి. ఎల్‌డొరాడోలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 23వేల ఎకరాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దీంతో ఈ జంటపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కార్చిచ్చు దావానలంలా వ్యాపించడంతో ఐదు ఇళ్లు ధ్వంసం అవడంతోపాటు, ఒక అగ్నిమాపక అధికారి కూడా మరణించారు. ఈ క్రమంలో ‘‘రెఫ్యూజియో మాన్యుయేల్ జిమెనెజ్ జూనియర్, ఎంజెలా రీనీ జిమినెజ్ జంట వల్లే ఇదంతా జరిగింది. ఈ దంపతుల మీద అసంకల్పిత మారణకాండతో సహా 30 నేరాలకు పాల్పడినట్లు’’ శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
జెండర్ రివీల్ పార్టీ..
మన దగ్గర లింగ నిర్థారణ పరీక్షలు చేయించినా.. చేసినా నేరంగా భావిస్తారు. కానీ అమెరికాతో పాటు కొన్ని దేశాల్లో డెలివరీకి కొన్ని నెలల ముందే వైద్యులు పుట్టబోయేది ఆడ పిల్లా, మగ పిల్లాడా అన్న విషయాన్ని వెల్లడిస్తారు. ఇక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తెలపడం కోసం జరిపేదే జెండర్ రివీల్ పార్టీ.
Comments
Please login to add a commentAdd a comment