కంచర్ల యాదగిరిరెడ్డి
ఆవకాయ పెట్టడం ఎలాగో అడిగితే గూగుల్ చెప్పగలదేమోగానీ.. సొంతంగా ఓ సినిమా కథ రాయమంటే మాత్రం చేతులెత్తేస్తుంది! మనమేది అడిగినా అవసరమైనదానితో పాటు సంబంధం లేని ఎన్నో విషయాలనూ గూగుల్ ఇస్తుంది. ఎందుకంటే.. ఎక్కడెక్కడి సమాచారాన్నో సేకరించి ఇవ్వడమే గూగుల్ చేయగలిగిన పని. సొంతంగా ఆలోచించడం దానికి సాధ్యం కాదు.
..అయితే మారుతున్న టెక్నాలజీతో ఈ పరిస్థితి మారిపోతోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ ‘చాట్ జీపీటీ’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అడిగిన సమాచారమేంటో కచ్చితంగా ఇస్తోంది. తప్పుగా అడిగితే తప్పనీ చెప్తోంది. విద్యార్థుల సందేహాలు తీరుస్తోంది. పిల్లల కథల నుంచి సాఫ్ట్‌వేర్ కోడ్‌ల దాకా రాసిపెడుతోంది. మరి ఏమిటీ చాట్ జీపీటీ? ఎలా పనిచేస్తుంది? ప్రయోజనం, ప్రభావాలేమిటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ.
అచ్చం మనిషిలా ఆలోచించి, స్పందించే కృత్రిమ మేధ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చాట్ జీపీటీ తాజా అవతారం. గతేడాది నవంబర్‌లోనే విడుదలైంది. దీనిపై ఎవ రికీ హక్కుల్లేకపోవడం విశేషం.ఓపెన్‌ఏఐ.కామ్ అన్న వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరూ దీంతో సంభాషించవచ్చు. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు, స్టాక్ మార్కెట్ నుంచి ఖగోళపు అంచుల వరకూ ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు.
సినిమా స్క్రిప్ట్ రాయాలని రామ్‌గోపాల్ వర్మ అడిగితే.. మూడే సెకన్లలో రాసేసింది. ఇదంతా బాగానే ఉందికానీ.. ఏమిటీ చాట్ జీపీటీ? ఒక్క ముక్కలో చెప్పాలంటే చాటింగ్ చేయగల కృత్రిమ మేధ రోబో అనాలి! కాకపోతే యాంత్రికంగా కాకుండా మనలా ఆలోచించి చేస్తుందన్నమాట.ఈ–కామర్స్ సహా వివిధ రంగాల కంపెనీల వెబ్‌సైట్లలోనూ చాటింగ్ కోసం రోబోలను వాడుతున్నారు. కానీ వాటి స్పందనలు చాలా పరిమితం. కంపెనీకి లేదా సైట్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే వివరాలు ఉంటాయి. చాట్ జీపీటీ దీనికి భిన్నం. ఇది చేయగల పనులకు అంతం లేదని చెప్పవచ్చు.
తప్పుదారి పట్టిస్తే.. పట్టేస్తుంది
కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులను (బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా చాట్ జీపీటీ చేయగలదు. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివీ అలవోకగా చేసేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకూ జవాబులిస్తుంది. పాటలు రాయడం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్‌ను తయారు చేయడం, చాట్ రూమ్‌ను రూపొందించడం, టిక్–టాక్–టో వంటి ఆటలాడటం కూడా చేయగలదు.
ఇలాంటి పనులు ఇతర రోబోలతోగానీ, గూగుల్‌తో కానీ అస్సలు సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చాట్‌జీపీటీ ఎంత తెలివైందంటే ఎప్పుడో వందల ఏళ్ల కింద అమెరికాను కనిపెట్టిన.. ‘క్రిస్టోఫర్ కొలంబస్ 2015లో అమెరికాకు వచ్చినప్పుడు ఏమైందో చెప్పు’అని అడిగామనుకోండి. మనం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తిస్తుంది. ప్రశ్నలో ఉన్నట్టుగా క్రిస్టోఫర్ ఒకవేళ 2015లో అమెరికాకు వచ్చి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకుని సమాధానం సిద్ధం చేస్తుంది. కొలంబస్ గతంలో చేసిన పనులపై ఇప్పుడు మనుషులేం అనుకుంటున్నారో కూడా పరిగణించి సమాధానాలిస్తుంది.
అంతా బాగున్నట్టేనా?
చాట్ జీపీటీకి కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేసిన బీటా వెర్షన్ మాత్రమే. అయితే ఇన్‌స్ట్రక్ట్ జీపీటీ పేరుతో సిద్ధం చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించడంతో.. దీనిద్వారా వచ్చే ప్రమాదకరమైన, మోసపూరితమైన సమాధానాలు తగ్గాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జాతి విద్వేషాలు, ఉగ్రవాదం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం చాట్‌జీపీటీకి దక్కకుండా ఓపెన్ ఏఐ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది.
చాట్ జీపీటీ కొన్నిసార్లు తిక్క సమాధానాలు ఇస్తుందని.. అది దాని పరిమితి అని చెప్తోంది. పైగా 2022 డిసెంబర్ వరకూ చాట్ జీపీటీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయకుండా సాఫ్ట్‌వేర్‌లోనే పరిమితులు చేశారు. మొత్తంగా చాట్ జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే సమాచారం అందకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మన దేశానికి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చాట్ జీపీటీతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్న వేశాడు. దక్షిణ భారతదేశంలో టిఫిన్ల రుచిని బట్టి ఓ జాబితా తయారు చేయమన్నారు. చాట్ జీపీటీ జాబితా తయారు చేసిందిగానీ.. అందులో బిర్యానీని కూడా చేర్చేసింది. ఆయనకు చిర్రెత్తుకొచ్చి.. బిర్యానీని టిఫిన్ అంటావా? నాలాంటి హైదరాబాదీని అవమానిస్తావా? అని కోపగించారు! మామూలు సాఫ్ట్‌వేర్ అయితే సంభాషణ ఇక్కడితో ఆగిపోయేదేమో! కానీ అది చాట్ జీపీటీ. వెంటనే ‘సారీ’చెప్పేసింది. పొరబాటుపడ్డానని ఒప్పేసుకుంది.
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే చాట్ జీపీటీతో చాటింగ్ చేశారు. చాలా అంశాలపై అవగాహన ఉన్న ఆయన.. త్వరగానే దాని సామర్థ్యాన్ని గుర్తించారు. వరుసగా కనీసం 17 ట్వీట్ల ద్వారా చాట్ జీపీటీతో జరిపిన సంభాషణలను దృష్టిలో ఉంచుకుని.. దాని ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేశారు.
చాట్ జీపీటీ విశేషాలు, ప్రత్యేకతలెన్నో..
నార్తర్న్ మిషిగన్ యూనివర్సిటీలో బుర్ఖా నిషేధంపై ఓ వ్యాసం రాయాల్సిందిగా ప్రొఫెసర్ ఆంటోని ఔమన్ విద్యార్థులను కోరారు. ఒక విద్యార్థి నుంచి విస్పష్టమైన ఆలోచనలతో సమాధానపత్రం అందింది. నిషేధం, నైతికత వంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. వ్యాసం అద్భుతంగా ఉందని అంటూనే.. సదరు విద్యార్థిని నువ్వే రాశావా అని ప్రొఫెసర్ నిలదీశారు. దీనితో అసలు విషయం బయటపడింది. ఆ వ్యాసం రాసింది చాట్ జీపీటీ. ఈ ఉదంతం తర్వాత వ్యాసరచన నిర్వహించే పద్ధతుల్లో మార్పులు చేయాలని ప్రొఫెసర్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని పలు వర్సిటీల అధ్యాపకులుకూడా ఇదే ఆలోచనలో ఉండటం గమనార్హం.
►ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన మరో కృత్రిమమేధ సాఫ్ట్‌వేర్ డాల్–ఈ2. కేవలం కొన్ని వివరాలిస్తే చాలు. ఇది వాటి ఆధారంగా బొమ్మలు గీస్తుంది.
►చాట్ జీపీటీని పరిశీలించిన తర్వాత చాలా పాఠశాలల్లో చాట్‌బోట్లను క్లాస్‌రూమ్‌లలో వాడే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. సియాటెల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించారు కూడా.
►2900 కోట్ల డాలర్లు ఓపెన్‌ఏఐ మార్కెట్ విలువ చాట్ జీపీటీ–3 విడుదల తరువాత ఏకంగా 2900 కోట్ల డాలర్లకు చేరుకుంది. త్వరలోనే మరింత మెరుగైన జీపీటీ–4ను విడుదల చేసే ఆలోచనలో కంపెనీ ఉంది.
►గూగుల్ కూడా ల్యామ్డా పేరుతో ఓ చాట్‌బోట్‌ను తయారు చేయగా.. మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీనే తన అజ్యూర్ క్లౌడ్ సర్వర్‌లో ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఓపెన్ ఏఐ కంపెనీలో సుమారు 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
►కొంతమంది విద్యార్థులు చాట్‌జీపీటీతో తమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు. కొంతమంది తమ సాఫ్ట్‌వేర్ కోడ్‌లలో తప్పులు వెతికేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు.
►57.8 కోట్లు టిక్‌టాక్‌లో చాట్‌జీపీటీ హ్యాష్‌ట్యాగ్‌కు నమోదైన వ్యూస్
ఎలా పని చేస్తుంది?
చిన్నపిల్లలకు మనం ఏ అంశమైనా ఎలా నేర్పిస్తాం? అక్షరాలైతే ఒకటికి వందసార్లు చెప్పించడం, రాయించడం చేస్తాం. అలాగే సమాచారమిచ్చి చదవడం అలవాటు చేస్తాం. చాట్‌జీపీటీ శిక్షణా ఇలాగే జరుగుతుంది. బులెటిన్ బోర్డ్ సిస్టమ్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వాడే ‘మ్యాన్ పేజెస్’వంటివి ఉంటాయి. టీచర్ల మాదిరిగా కొంతమంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లు చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పించడంతోపాటు నేర్చుకుంటున్న విషయాలను గమనిస్తూ వాటిలో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చారు.
పదే పదే రాయడం, లేదా వల్లె వేయడం ద్వారా మనం నేర్చుకున్నట్టే.. చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పారు. చాట్‌జీపీటీ స్పందనలను ర్యాంక్ చేయడం ద్వారా అది తన తప్పొప్పులను తెలుసుకునేలా చేశారు. మంచి ర్యాంకులివ్వడం ద్వారా ఫలానా అంశం నేర్చుకుంటే లాభమన్న భావన కల్పించారు. దీనికితోడు చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి తాను నేర్చుకున్న అంశాలకు మెరుగులు దిద్దుకుంటుంది. ఈ క్రమంలో మనం చాట్‌జీపీటీతో జరిపిన సంభాషణలనూ వాడుకుంటుంది. చాట్ జీపీటీ స్పందనలకు మన అభిప్రాయాలను అప్‌వోట్ లేదా డౌన్‌వోట్ ద్వారా తెలియజేస్తే దాని ఆధారంగా తప్పులు దిద్దుకోవడమూ చేస్తుంది.
Best AI Tools You Need To Know#chatgpt #chatgpt3 #ArtificialIntelligence #ai pic.twitter.com/0jfr8cOMoo
— John Vianny (@johnvianny) January 13, 2023
Comments
Please login to add a commentAdd a comment