
ప్రతీకాత్మక చిత్రం
కోపెన్‌హాగన్ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఇంతవరకు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాకపోవడంతో దాని దాడి నుంచి తప్పించుకునేందుకు మాస్కులు ధరించడమే మంచి మార్గమని వైద్య నిపుణులు మొదటి నుంచి చెబుతున్న విషయం తెల్సిందే. కంటికి కనిపించని కరోనా వైరస్‌ను ఆపడం మాస్కుల తరం కాదంటూ, మాస్కులు ధరించడం వల్ల సరిగ్గా శ్వాస పీల్చుకోలేక ఊపిరి తిత్తులు దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉందని మరో పక్క ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతకు మాస్కులు ధరించడం ఉత్తమమా, ధరించక పోవడం ఉత్తమమా!? అన్న సందేహం ఎంతో మందిలో నాటుకున్న విషయం తెల్సిందే.
ఇదే విషయమై మరింత స్పష్టత కోసం కోపెన్‌హాగన్ యూనివర్శిటీ ఆస్పత్రి పరిశోధకులు తాజాగా ఆరువేల మంది డానిష్ ప్రజలపై ప్రయోగం చేశారు. వారిని మూడు వేల మంది చొప్పున రెండు బృందాలుగా విభజించి ఓ బృందానికి సురక్షితం అని భావిస్తోన్న ఎన్ 95 మాస్కులు ఇచ్చి, మరో బృందానికి మాస్కులు లేకుండానే నెల రోజులపాటు జనంలో తిరగాల్సిందిగా కోరింది. ముందు జాగ్రత్తగా ప్రయోగానికి ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలను లేనివారినే ఎంపిక చేసుకొంది. (గుడ్‌న్యూస్: క్రిస్మస్‌కు ముందే కరోనా వ్యాక్సిన్)
నెల రోజుల తర్వాత రెండు బృందాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, మాస్కులు ధరించిన వారిలో 1.8 శాతం మందికి, ధరించని వారిలో 2.1 శాతం మందికి కరోనా ఉన్నట్లు బయటపడింది. రెండు బృందాల మధ్య ఈ తేడా అతి స్వల్పమని, మాస్కులు ధరించిన వారిలో ఒక శాతానికి మించకుండా కరోనా వచ్చి ఉంటే అది ప్రయోజనంగా కనిపించేదని పరిశోధకులు తేల్చారు. రెండు బృందాల మధ్య స్వల్ప తేడా రావడానికి కూడా మాస్కులే కారణమని భావించినా వాటి ప్రయోజనం అతి స్వల్పమేనని పరిశోధకులు పేర్కొన్నారు.
మాస్కులు ధరించడం వల్ల వారికి ప్రయోజనం లేకున్నా చుట్టుపక్కలున్న ఇతరులకు ఎంతో ప్రయోజనకరమని, కరోనా వచ్చిన వాళ్లు తప్పకుండా మాస్కులు ధరించాల్సిందేనని సీడీసీ మాజీ డైరెక్టర్ డాక్టర్ థామస్ ఫ్రీడెన్ తెలిపారు. ఈ విషయం ఇంతకుముందు నిర్వహించిన పరిశోధనల్లో కూడా తేలిందని ఆయన చెప్పారు. చుట్టుపక్కల మసలే కరోనా రోగుల నుంచి వైరస్ సోకకుండా ఉండాలంటే సీడీసీ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజే ఈ తాజా అధ్యయనం ఫలితాలు వెలుగులోకి రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment