ఆంక్షల కారణంగా నిర్మానుష్యంగా మారిన లండన్‌లోని కర్నాబే స్ట్రీట్
లండన్: కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నమోదు కానంత భారీగా, రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో యూకేలో 36,804 కేసులు నమోదయ్యాయని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్’ మంగళవారం ఉదయం 9 గంటలకు(స్థానిక కాలమానం) ప్రకటించింది. అలాగే, గత 24 గంటల్లో 691 మంది కోవిడ్–19 తో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో, బ్రిటన్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 68,307కి, మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,10,304కి చేరింది. గతంలో ఒక్కరోజులో అత్యధికంగా నమోదైన కేసుల సంఖ్య 35,928. ఇది కూడా ఈ ఆదివారమే నమోదు కావడం గమనార్హం.
అదుపు చేయగలం:డబ్ల్యూహెచ్‌ఓ
బ్రిటన్‌లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి అదుపు తప్పిన దశకు ఇంకా చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రారంభమైన తరువాత పలు సందర్భాల్లో ఇంతకుమించిన స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందిన ఉదాహరణలు ఉన్నాయని, ఆ స్థితిని కూడా అదుపు చేయగలిగామని సంస్థ ఎమెర్జెన్సీస్ చీఫ్ మైఖేల్ ర్యాన్ వ్యాఖ్యానించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు సరిపోతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment