ఆస్ట్రాజెనికా లాగే పవర్‌ఫుల్‌.. ‘మెడిజెన్‌’కు గ్రీన్‌ సిగ్నల్‌! | Covid 19: Taiwan Nods To Locally Made Vaccine For Emergency Use | Sakshi
Sakshi News home page

Taiwan: ‘మెడిజెన్‌’ టీకా ఎమర్జెన్సీ వినియోగానికి గ్రీన్‌ సిగ్నల్‌

Published Mon, Jul 19 2021 7:03 PM | Last Updated on Mon, Jul 19 2021 7:07 PM

Covid 19: Taiwan Nods To Locally Made Vaccine For Emergency Use - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తైపీ: కోవిడ్‌-19పై పోరులో తైవాన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కరోనా నిరోధక వాక్సిన్ల కొరత వేధిస్తున్న తరుణంలో స్థానికంగా తయారైన మెడిజెన్‌ టీకా వాడకానికి అత్యవసర అనుమతి ఇస్తున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌ ఆస్ట్రాజెనికా టీకా వలె ప్రభావంతంగా పనిచేస్తూ, మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైందని తెలిపింది. ఈ మేరకు తైవాన్‌ ఆరోగ్య శాఖ.. ‘‘నిపుణుల బృందం మెడిజెన్ టీకా ఎమర్జెన్సీ వినియోగానికి ఆమోదం తెలిపింది. పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయాలు లేవని స్పష్టం చేసింది. ఆగష్టు మొదటి వారం నుంచే టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది’’ అని  ప్రకటన విడుదల చేసింది. 

ఈ సందర్భంగా తైవాన్‌ ఆరోగ్య శాఖా మంత్రి చెన్‌ షిహ్‌- చుంగ్‌ మాట్లాడుతూ.. త్వరలోనే వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచనున్నట్లు మెడిజెన్‌ తెలిపిందన్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామని వెల్లడించారు. కాగా ఎమ్‌వీసీ-కోవ్‌1901 పేరుతో మెడిజెన్‌ వాక్సిన్‌ బయోలాజిక్స్‌ కార్పొరేషన్‌ కోవిడ్‌ టీకాను ఉత్పత్తి చేస్తోంది. రెండో దశ ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చాయని, క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి కావాల్సి ఉందని కంపెనీ ఇటీవల ప్రకటించింది. అయితే, 20 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే రెండు డోసుల్లో టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది.

కాగా చైనా మెయిన్‌లాండ్‌లో భాగమైన తైవాన్‌లో గతేడాది తక్కువ సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, సెకండ్‌వేవ్‌లో ఎయిర్‌లైన్‌ పైలెట్ల ద్వారా కోవిడ్‌ వ్యాప్తి తీవ్రమై, సుమారు 800 మంది మరణాలకు దారితీసింది. ఇక ఇప్పటికే తైవాన్‌ స్వతంత్ర భావజాలంపై చైనా ఇప్పటికే కన్నెర్ర చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఫైజర్‌ టీకా కొనుగోలు విషయంలో తాము చేస్తున్న ప్రయత్నాలకు డ్రాగన్‌ దేశం గండికొట్టిందని తైవాన్‌ ఆరోపించింది.

అదే సమయంలో.. తమకు అండగా నిలుస్తున్న అమెరికా ఇప్పటికే 25 లక్షల వ్యాక్సిన్‌ డోసులను, జపాన్‌ 3.37 మిలియన్‌ టీకా డోసులను విరాళంగా ఇచ్చినట్లు తైవాన్‌ వెల్లడించింది. అదే విధంగా ఫోక్సోకాన్‌ అండ్‌ తైవాన్‌ సెమికండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ సైతం 5 మిలియన్‌ వాక్సిన్లు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా మొత్తం 23 మిలియన్‌ జనాభా కలిగిన తైవాన్‌ ప్రస్తుతం స్థానికంగా తయారైన టీకా వాడకానికి ఆమోదం తెలపడం ద్వారా వాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు అడుగులు వేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement