ఇప్పటివరకు ఆఫ్రికన్ బుష్ ఏనుగులు మాత్రమే అతి తక్కువ సమయం నిద్రించే జంతువులుగా గుర్తించబడ్డాయి. తాజాగా.. ఆ జాబితాలో సముద్ర జీవి ‘ఎలిఫెంట్ సీల్’ కూడా చేరిపోయింది. ఆఫ్రికన్ ఏనుగుల మాదిరిగానే ఎలిఫెంట్ సీల్స్ కూడా రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
– సాక్షి, అమరావతి
ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు పసిఫిక్ సముద్ర జలాల్లో ప్రయాణించే భారీ క్షీరదాలైన ఎలిఫెంట్ సీల్స్ రోజంతా వేటలోనే నిమగ్నమై ఉంటాయట. గొరిల్లాలు రోజుకు 12 గంటలు, కుక్కలు 10 గంటలు, సింహాలు 20 గంటల వరకు నిద్రిస్తుంటే.. సీల్స్ నిద్ర సమయంలో చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం.
ఆడ సీల్స్ తలపై సెన్సార్లు అమర్చి..
ఎలిఫెంట్ సీల్స్ మెదడు, హృదయ స్పందన, కదలికలు, ప్రయాణించే లోతు, నిద్రించే సంకేతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన వాటర్‌ఫ్రూఫ్ సింథటిక్ రబ్బరు టోపీలను ఉత్తర ప్రాంతంలోని ఆడ సీల్స్ తలలపై అమర్చి.. వాటి జీవన స్థితిని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. ఎందుకంటే ఆడ సీల్స్ మాత్రమే ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణిస్తాయి. మగ సీల్స్ ఒడ్డునే ఉంటూ ఆహారాన్ని తింటాయి.
ఇవి 4,500 పౌండ్ల వరకు పెద్ద శరీర బరువును కలిగి ఉండటం.. సముద్రంలో ఎక్కువ కాలం మేత వెతకాల్సిన కారణంగా ఈ నిద్ర ప్రవర్తన అభివృద్ధి చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మగ ఎలిఫెంట్ సీల్స్‌కు ఏనుగు మాదిరిగా చిన్న తొండం ఉంటుంది. అందుకే.. వీటిని ఎలిఫెంట్ సీల్స్‌గా పిలుస్తారు.
అది కూడా విడతల వారీగానే..
ఇన్‌ట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎలిఫెంట్ సీల్స్ సముద్ర ఉపరితలం నుంచి సుమారు 377 మీటర్ల లోతు (1,237 అడుగులు)కు వెళ్లి నిద్రిస్తున్నట్టు కనుగొన్నారు. ఇవి ఏకబిగిన కాకుండా 20 నిమిషాల కంటే తక్కువ సేపు ‘క్యాట్‌నాప్’ (స్వల్పకాలిక) శ్రేణిలో మొత్తంగా 2 గంటలపాటు నిద్రిస్తున్నట్టు అంచనా వేశారు. ఎలిఫెంట్ సీల్స్ పెద్ద మొత్తంలో చేపల్ని వేటాడి తింటాయి. అయితే, ఇవి శత్రు జీవులైన సొర చేపలు, కిల్లర్ వేల్స్ దాడిలో మరణిస్తుంటాయి. ఇవి ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు లోతైన జలాల్లోకి వెళ్లి కొద్ది నిమిషాలపాటు (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్) నిద్ర అనుభవిస్తున్నట్టు నిర్ధారించారు.
ఎక్కువసేపు నీటిలోనే..
వాస్తవానికి 10 నుంచి 30 నిమిషాల డైవ్‌లో కొద్దిసేపు మాత్రమే సముద్ర ఉపరితలంలో ఏనుగు సీల్స్ కనిపిస్తాయి. మిగిలిన సమయమంతా జలాల్లోనే ఈదుతూ ఆహార వేటను కొనసాగిస్తాయి. విచిత్రంగా ఈ క్షీరదాలు సంతానోత్పత్తి సమయంలో తీరంలో రోజుకు 10 గంటల సమయం నిద్రపోతాయి. ప్రతి 30 నిమిషాల పాటు సాగే డైవ్‌లో సీల్స్ తలకిందులుగా స్లో–వేవ్ స్లీప్ అని పిలిచే లోతైన నిద్ర దశలోకి వెళ్తున్నాయి.
వివిధ జంతువులు నిద్ర సమయం ఇలా..
(రోజుకు గంటల్లో సుమారుగా)
గుర్రం 2.9
గాడిద 3.1
ఏనుగు 3.9
జిరాఫీ 4.5
మేక 5.3
కుందేలు 11.4
చింపాంజీ 9.7
కుక్క 10.0
పులి 15.8
ఎలుక, పిల్లి 12.5
ఉడుత 14.9
చిరుత 18.0
సింహం 20
Comments
Please login to add a commentAdd a comment