ఇవాళ తేదీ 14–05–2022.. ఇది అందరికీ తెలుసు. ప్రత్యేకంగా చెప్పేదేముంది అంటారా! అవును..
ఇది మనకైతే కరెక్టే. కానీ ఇథియోపియాలో మాత్రం కాదు.
ఈ రోజు వాళ్ల తేదీ ఏమిటో తెలుసా.. 6–9–2014. ఇదేదో చిత్రంగా ఉందనిపిస్తోందా? ఈ వివరాలేమిటో తెలుసుకోవాలని ఉందా..
అయితే పదండి..
– సాక్షి సెంట్రల్ డెస్క్
వలస పాలన ప్రభావం తప్పించుకుని..
16, 17, 18వ శతాబ్దాల్లో యూరప్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా వలస పాలన నెలకొల్పడమే.. గ్రెగోరియన్ కేలండర్ విస్తృతికి ముఖ్య కారణం. అయితే ఇథియోపియా ఎన్నడూ వలస పాలనప్రభావానికి లోనుకాలేదు. 1935లో ముస్సోలినీ ఆధ్వర్యంలోని ఇటలీ నియంతృత్వ ప్రభుత్వం ఇథియోపియాను ఆక్రమించినా అది1941లోనే ముగియడంతో.. ప్రభావంపడలేదు.ఇథియోపియన్లు తమ సొంత కేలండర్, సమయం వంటివి కొనసాగించుకున్నారు.
సొంత కేలండర్‌తో..
ప్రస్తుతం మన దేశంతోపాటు ప్రపంచమంతా వినియోగిస్తున్న తేదీ, సమయం విధానాన్ని గ్రెగోరియన్ కేలండర్ అంటారు. సుమారు రెండు శతాబ్దాలుగా ప్రపంచమంతా ఇదే అధికారిక కేలండర్‌గా కొనసాగుతోంది. కానీ ఇథియోపియా మాత్రం తమ దేశంలో భిన్నమైన సొంత కేలండర్‌ను వినియోగిస్తోంది. ఇది ప్రపంచదేశాల కంటే సుమారు ఏడున్నరేళ్లు వెనుక కొనసాగుతుంది.
వారికి 13 నెలలు..
మనకు ఏడాదిలో 12 నెలలుంటే.. ఇథియోపియాలో 13 నెలలు ఉంటా యి. 12 నెలలపాటు ప్రతినెలా 30 రోజులు ఉంటాయి. 13వ నెల మాత్రం మామూలు సంవత్సరాల్లో ఐదు రోజులు, లీప్ సంవత్సరంలో ఆరు రోజులు ఉంటుంది. ఈ నెలను పగ్యూమ్‌గా పిలుస్తారు. పగ్యూమ్ అనే పేరు గ్రీక్ భాషలోని ‘ఎపగోమీన్’ నుంచి వచ్చిందని చెప్తారు.. ‘ఏడాదిలో సమయాన్ని లెక్కిస్తూ మరిచిపోయిన రోజులివి’ అని ఈ పదానికి అర్థమట.
ఉదయం ఆరు తర్వాతే రోజు మొదలు..
ఇథియోపియాలో సమయాన్ని లెక్కించే విధానమూ భిన్నమే. మన కేలండర్‌లో అర్ధరాత్రి 12 తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ వారికి ఉదయం ఆరు గంటలకు మరుసటి రోజు మొదలవు తుంది.
ూ ఉదాహరణకు మనం శనివారం పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. ఆ రోజంతా శనివారమే ఉంటుంది. ఇథియోపియాలో పొద్దున ఐదున్నరకు నిద్రలేస్తే.. అప్పటికి ఇంకా శుక్రవారమే. ఇంకో అరగంట గడిచి ఆరు దాటితేనే శనివారం మొదలైనట్టు.
బైబిల్ ఆధారం.. ఆలోచనల సముద్రం!
ఇథియోపియన్లు బైబిల్ ఆధారంగా తమ కేలండర్‌ను రూపొందించుకున్నారు. దీనిని వారు ‘సీ ఆఫ్ థాట్స్ (ఆలోచనల సముద్రం)’గా చెప్పుకొంటారు. దేవుడి తొలి సృష్టి అయిన ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరూ ఏడేళ్లపాటు గార్డెన్ ఆఫ్ ఈడెన్‌లో నివసించారని.. తర్వాత వారి పాపాల ఫలితంగా బయటికి పంపేయబడ్డారని.. వారు పశ్చాత్తాపడటంతో 5,500 ఏళ్ల తర్వాత వారిని రక్షిస్తానని దేవుడు మాటిచ్చాడని బైబిల్ లోని వాక్యాలను గుర్తుచేస్తారు. ఈడెన్ గార్డెన్‌లో ఆడమ్‌అండ్ ఈవ్ గడిపిన ఏడేళ్లను తమ కేలండర్ నుంచి తొలగించారని చెప్తారు.
ప్రపంచమంతా జీసస్ పుట్టినది క్రీస్తుశకం 1వ సంవత్సరంలోనని గుర్తిస్తే.. ఇథియోపియన్లు మాత్రం అంతకు ఏడేళ్ల ముందు క్రీస్తుపూర్వం 7వసంవత్సరంలో జీసస్ జన్మించాడని నమ్ముతారు.
ఇథియోపియా కేలండర్‌లో వారంలో మొదటిరోజును ‘ఎహుద్’గా పిలుస్తారు. బైబిల్ ప్రకారం దేవుడు భూమిని, స్వర్గాన్ని సృష్టించడం మొదలుపెట్టిన రోజు అని దీని అర్థం.
ప్రపంచమంతా జనవరి 1న నూతన సంవత్సరాన్ని జరుపుకొంటే.. ఇథియోపియన్లు సెప్టెంబర్ 11న (లీప్ సంవత్సరమైతే 12వ తేదీన) సంబరాలు చేసుకుంటారు. వారి వార్షిక కేలండర్ ఆ రోజు నుంచే మొదలవుతుంది.
లీప్ సంవత్సరం వచ్చే ప్రతి నాలుగు ఏళ్లను బైబిల్ ఎవాంజలిస్టులు అయిన నలుగురి పేర్లతో పిలుస్తారు. మొదటి ఏడాదిని జాన్ ఇయర్‌గా, రెండో ఏడాదిని మ్యాథ్యూ ఇయర్, మూడో ఏడాదిని మార్క్ ఇయర్, నాలుగో ఏడాదిని ల్యూక్ ఇయర్‌గా వ్యవహరిస్తారు.
ఈసారి వారి 2015 నూతన సంవత్సర వేడుకలు ‘2022 సెప్టెంబర్ 11’న జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment