ఇల్లు అలకగానే పండుగ కాదు అంటుంటారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లది ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితే. 20 ఏళ్ల తర్వాత దేశాన్ని మళ్లీ ఆక్రమించుకున్న తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రజలపై తమ పాలన రుద్దడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలోనే కొలువుదీరనున్నారు. తాలిబన్ కమాండర్లే ఇక గవర్నర్లు, మేయర్లుగా అవతారం ఎత్తుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కల్లోలిత అఫ్గాన్ పాలన అనుకున్నంత సులభం కాదని, తాలిబన్ల కోసం ఎన్నో సవాళ్లు ఎదురు చూస్తున్నాయని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం..
చదవండి: Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్ ఎంపీ కన్నీటి పర్యంతం
జనామోదం సాధ్యమా?
అఫ్గాన్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న అష్రాఫ్ ఘనీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య వంటి కనీస సదుపాయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు అంతంతే. అవినీతి పెచ్చరిల్లింది. జనం మార్పును కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం తాలిబన్లను స్వాగతిస్తున్నారని కాదు. ఘనీ అసమర్థ, అవినీతి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజల మనసులను గెలుచుకోవడం తాలిబన్లకు కత్తి మీద సామేనని చెప్పొచ్చు. షరియా చట్టం పేరిట గతంలో సాగించిన నిరంకుశ పాలనకు ఈసారి స్వస్తి చెప్పి, సంస్కరణలకు బాటలు పరిచి, జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడితే తాలిబన్లకు కొంత జనామోదం లభించే అవకాశం ఉంది.
బలగాలు సరిపోతాయా?
అఫ్గానిస్తాన్ ప్రస్తుత జనాభా 3.80 కోట్ల పైమాటే. తాలిబన్ల సంఖ్య కేవలం లక్ష లోపే. దేశంలో కొన్ని ప్రాంతాలు ఇంకా వారి నియంత్రణలోకి రాలేదు. మారుమూల ప్రాంతాల్లో వార్‌లార్డ్స్(స్థానిక భూస్వాములు) పెత్తనం సాగిస్తున్నారు. సొంతంగా ప్రైవేట్ సైన్యాలను నిర్వహిస్తున్నారు. ఇలాంటి వారిని అణచివేసి, దేశం మొత్తాన్ని తమ పరిధిలోకి తీసుకురావాలంటే తాలిబన్లు తమ బలం, బలగాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది.
పాలనపై పట్టు చిక్కేనా?
తుపాకులు పట్టి శత్రువులపై పోరాడడం తప్ప ప్రజలకు సుపరిపాలన అందించడం తాలిబన్లకు పెద్దగా అలవాటు లేదు. చెప్పుకోదగ్గ ఆధునిక సదుపాయాలు లేని అఫ్గాన్‌ను పాలించడం కష్టమైన పనేనని సాక్షాత్తూ ప్రభుత్వ అధికారులే అంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపించడానికి తగిన యంత్రాంగం కూడా అఫ్గాన్‌లో లేదు. పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాల్సిందే. 1996– 2001 వరకూ దేశాన్ని పాలించినప్పుడు తాలిబన్లు అరాచకానికి మారుపేరుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడైనా తీరు మార్చుకోకపోతే జనం తిరగబడడానికి ఎక్కువ సమయం పట్టదు.
సొంత బలగాలను అదుపు చేసేదెలా?
విదేశీ శక్తులపై పోరాటం అనే భావన తాలిబన్లను ఇన్నాళ్లూ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని తాలూకు అవలక్షణాలన్నీ ఒంటబట్టడం ఖాయం. కొందరు అధికార భోగాలు అనుభవిస్తుండడం, మరికొందరు సాధారణ సైనికులుగా మిగిలిపోవడం వంటివి వారిలో విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేయడాన్ని కొట్టిపారేయలేం. తాలిబన్ పాలకులు తమ సొంత బలగాలను ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.
మైనార్టీలను మచ్చిక చేసుకొనేదెలా?
మహిళలు, మైనార్టీల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరిస్తారన్న చెడ్డపేరుంది. వారి నిర్వాకం వల్ల అఫ్గానిస్తాన్ ప్రపంచంలో ఏకాకిగా మారింది. దేశంలో పెద్ద సంఖ్యలో గిరిజన తెగలున్నాయి. వీటిలో చాలా తెగలకు తాలిబన్లతో శత్రుత్వం కొనసాగుతోంది. వారిని మచ్చిక చేసుకొని, మిత్రులుగా మార్చుకోవడం సులభంగా సాధ్యమయ్యే పని కాదని స్థానికులు అంటున్నారు. మానవ హక్కులను, మైనార్టీల హక్కులను కాపాడడం, పౌర చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం వంటివి తాలిబన్ల ముందున్న పెద్ద సవాళ్లు.
ఆర్థిక పరిస్థితి ఆగమాగం
ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అఫ్గానిస్తాన్ ముందు వరుసలో ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అఫ్గాన్‌కు లభించే ఆదాయంలో 20 శాతానికి పైగా విదేశాల ఆర్థిక సాయం నుంచే అందుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ఆ సాయం మొత్తం ఇక నిలిచిపోయినట్లే. మరోవైపు అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. అంతేకాదు అఫ్గాన్‌కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఐఎంఎఫ్ తేల్చిచెప్పింది. అఫ్గాన్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్టులో చేర్చింది. దీంతో విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. అఫ్గాన్‌లో ఖనిజ సంపద ఉన్నప్పటికీ దాన్ని తవ్వితీయాలంటే విదేశీ పెట్టుబడులు అవసరం. తాలిబన్ పెద్దలు ఇక రష్యా, చైనా, పాకిస్తాన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు.
– నేషనల్ డెస్క్, సాక్షి
చదవండి: తాలిబన్ల దమనకాండ
Comments
Please login to add a commentAdd a comment