న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంక్స్–2024’ ఈ మేరకు పేర్కొంది. ఇందులో భారత పాస్‌పోర్టు 85వ స్థానంలో ఉంది. 2023 కంటే ఈసారి ఒక స్థానం పడిపోయింది. గతేడాది ఇండియా పాస్‌పోర్టుతో 60 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే వీలుండేది. ఈ ఏడాది అది 62కు పెరిగినా ర్యాంకు మాత్రం పడిపోయింది!
అత్యంత శక్తివంతమైన ఫ్రాన్స్ పాస్‌పోర్టు కలిగి ఉంటే 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో ఫ్రాన్స్ తర్వాత జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ నిలిచాయి. పాకిస్తాన్ పాస్‌పోర్టు ఈసారి కూడా 106వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పాస్‌పోర్టు ర్యాంకు 101 నుంచి 102కు పడిపోయింది. చిన్నదేశమైన మాల్దీవుల పాస్‌పోర్టు ర్యాంకు 58. ఈ పాస్‌పోర్టు ఉంటే 96 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చు.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఏటీఏ) డేటా ఆధారంగా పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తుంటారు. ఇందుకోసం గత 19 ఏళ్ల డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 199 పాస్‌పోర్టులకు ర్యాంకులు ఇస్తారు. వీసా లేకున్నా తమ దేశంలో పర్యటించే అవకాశం కలి్పస్తున్న దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2006లో సగటున 58 దేశాల్లో వీసా రహిత ప్రయాణ సౌలభ్యం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్య 111కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment