
కొన్ని ఇంటర్నెషనల్ బ్రాండ్ దుస్తుల ఖరీదు చూస్తే.. కళ్లు తిరుగుతాయి. అరే ఇంత ఖరీదు పెట్టడానికి అసలు వాటిలో ప్రత్యేకత ఏంటో మనలాంటి సామాన్యులకు అర్థం కాదు. కేవలం సెలబ్రిటీలు మాత్రమే వాటిని కొనే ధైర్యం చేస్తారు. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత గుస్సి బ్రాండ్‌కు చెందిన ఓ కుర్తా ఖరీదు తెలిస్తే.. హవ్వా అంటూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. దీనిపై దేశీ నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
ఆ వివరాలు.. గుస్సి తాజాగా తన కలెక్షన్‌లో భారతీయ మహిళలు ఎక్కువగా ఇష్టపడే కుర్తీలను తీసుకువచ్చింది. కుర్తీని కాస్త పొరపాటుగా కఫ్తాన్‌గా పేర్కొంది. ఇక దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా పేర్కొంది. అంటే మన కరెన్సీలో సుమారు 2,50,000 రూపాయలకు పైగా ఖరీదన్నమాట.
Gucci selling an Indian kurta for 2.5 lakhs ? I'll get the same thing for 500 bucks 💀 pic.twitter.com/Opw2mO5xnV
— nalayak (@samisjobless) June 1, 2021
చూడటానికి కూడా పెద్దగా బాగాలేదు. గొప్ప కలర్ కూడా కాదు. తెలుపు రంగు కుర్తీ మీద నెక్ దగ్గర మెరూన్ డిజైన్‌తో ఉన్న ఈ కుర్తీకి 2.5 లక్షల రూపాయల ఖరీదుగా ప్రకటించడంతో మన నెటిజనులు ఏ మాత్రం కన్విన్స్ కాలేకపోతున్నారు. ‘‘ఏంటి ఈ కుర్తా ఖరీదు 2.5 లక్షలా.. మా అమ్మ 250 రూపాయల్లో కొనుగోలు చేస్తుంది’’.. ‘‘నేనైతే ఇలాంటివి 500 రూపాయలకు రెండు ఇప్పిస్తాను’’.. ‘‘నా బర్త్‌డేకి ఇదే కొనబోతున్నాను.. అయితే రెండున్నర లక్షల రూపాయలకు కాదు.. కేవలం 250 రూపాయలకు మాత్రమే.. ‘‘బ్రాండ్ పేరు చెప్పి.. ఇంత ఖరీదు ప్రకటించడం ఏమైనా బాగుందా’’అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.