భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది.
ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు.
తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్‌లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది.
ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు.
ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment