సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోనే కాదు.. విదేశాల్లోనూ సిటీ లేడీస్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, తదితర అవసరాల కోసం విదేశాలకు వెళ్తున్న నగరవాసులు ఆ దేశాల్లో సొంత డ్రైవింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. విశాలమైన రోడ్లు, సురక్షితమైన డ్రైవింగ్ సదుపాయం ఉండడంతో మహిళలు సైతం సొంత వాహనాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉద్యోగాల కోసం వెళ్లిన వాళ్లే కాకుండా సాధారణ గృహిణులు కూడా సొంత వాహనాలపైన ఎక్కువగా ఆధారపడాల్సి రావడం వల్ల డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు. దీంతో నగరంలో అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు పురుషులతో పాటు మహిళలు సైతం పోటీ పడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి ఏడాది సుమారు 8 వేల నుంచి 10 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు జారీ అవుతుండగా అందులో 1500 నుంచి 2000 వరకు మహిళల పర్మిట్లు ఉంటున్నాయి. రవాణా శాఖ అందజేసే అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు విదేశాల్లో ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయి. ఈ పర్మిట్లతో అక్కడ ఏడాది పాటు వాహనాలు నడుపొచ్చు. ఆ లోపు అక్కడి రవాణాశాఖ ప్రమాణాల మేరకు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకోవలసి ఉంటుంది. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళ్తున్న మహిళలు అక్కడికి వెళ్లిన తరువాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్‌ను తప్పనిసరిగా భావిస్తున్నారు.
పెరుగుతున్న అంతర్జాతీయ పర్మిట్లు..
అమెరికా వంటి దేశాల్లో చాలా చోట్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ తక్కువ. దీంతో ప్రతి ఒక్కరు సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. హైదరాబాద్‌లో సొంత వాహనాలపైన పరుగులు తీసిన వాళ్లు అక్కడికి వెళ్లిన తరువాత మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. అక్కడి పటిష్టమైన డ్రైవింగ్ నిబంధనలు కూడా అందుకు ఇతోధికమైన ప్రోత్సాహాన్ని అందజేస్తున్నాయి. సాధారణంగా మన రోడ్డు నిబంధనలకు విదేశాల్లో నిబంధనలకు మధ్య ఎంతో తేడా ఉంటుంది. అక్కడ స్టీరింగ్ ఎడమ వైపు ఉంటే మన దగ్గర కుడి వైపునకు ఉంటుంది. రోడ్లకు అనుగుణమైన వేగ నియంత్రణ వ్యవస్థ అమలవుతుంది. దీంతో మహిళలు ధైర్యంగా వాహనాలు నడుపుతున్నారు.
24 గంటల్లోనే...
డ్రైవింగ్ లైసెన్సుతో పాటు, విదేశాలకు వెళ్లేందుకు వీసా కలిగిన వాహనదారులు అంతర్జాతీయ పర్మిట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రస్తుతం ఆన్‌లైన్‌లో స్లాట్ సమోదు చేసుకొనే సదుపాయం ఉంది. దరఖాస్తు చేసుకొన్న 24 గంటల వ్యవధిలోనే
అంతర్జాతీయ పర్మిట్లను వాహనదారులకు
అందజేస్తారు.
ఎంతో భరోసా
హైదరాబాద్‌లో డ్రైవింగ్‌లో ఎంత అనుభవం ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్లిన తరువాత కొద్దిగా భయం ఉంటుంది. అధికారులు వాహనాలను నిలిపివేసినప్పుడు గందరగోళంగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో హైదరాబాద్ నుంచి వెంట తెచ్చుకున్న అంతర్జాతీయ పర్మిట్ ఒక భరోసానిస్తుంది. డ్రైవింగ్‌లో అనుభవానికి అది ప్రామాణికంగా దోహదం చేస్తుంది. – జ్యోతి, న్యూజిల్యాండ్
Comments
Please login to add a commentAdd a comment