న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో రష్యాకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఐరాసకు చెందిన నాలుగు కమిటీల ఎన్నికల్లో పాల్గొన్న రష్యా నాలిగింటిలో పరాజయం పాలైంది. ఒక ఎన్నికలో రష్యాపై ఉక్రెయిన్ విజయం సాధించింది. ప్రపంచ దేశాలు రష్యా దాడిని సమర్ధించడం లేదనే విషయాన్ని తాజా ఫలితాలు చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ ఆఫ్ ఎన్‌జీఓస్, యూఎన్ వుమెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, పర్మినెంట్ ఫోరమ్ ఆన్ ఇండిజీనస్ ఇస్యూస్ కమిటీలకు జరిగిన ఎన్నికల్లో రష్యా పోటీ చేసింది.
ఐరాస ఆర్థిక, సామాజిక మండలి ఈ ఎన్నికలను నిర్వహించింది. వీటిలో రష్యా ఓటమిని ఐరాసలో బ్రిటన్ రాయబారి వెల్లడించారు. రష్యాకు కేవలం సైనికంగానే కాకుండా ప్రపంచ దేశాల మద్దతు పరంగా కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని వ్యాఖ్యానించారు. తొలి మూడు కమిటీల్లో 54 ఓట్లకుగాను రష్యాకు వరుసగా 15, 16, 17 ఓట్లు, చివరి కమిటీలో 52 ఓట్లకుగాను 18 ఓట్లు రష్యాకు వచ్చాయి. చివరి కమిటీ ఎన్నికలో ఉక్రెయిన్ 34 ఓట్లతో గెలుపొందింది. ఈ కమిటీలతో పాటు పలు ఇతర కమిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి.
భారత్ గెలుపు
ఐరాస ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ఎన్నికల్లో కమిషన్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, కమిటీ ఆన్ ఎన్‌జీఓస్, కమిషన్ ఆన్ ఎస్‌అండ్‌టీ, కమిటీ ఫర్ ఈఎస్‌సీఆర్‌లో భారత్ గెలుపొందిందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి వెల్లడించారు. చివరి కమిటీలో భారత అంబాసిడర్ ప్రీతీ శరన్ మరలా గెలుపొందారన్నారు. ఈ కమిటీలు నాలుగేళ్ల కాలపరిమితితో పనిచేస్తాయి. చివరి కమిటీలో రష్యా కూడా సభ్యత్వం గెలుచుకుంది. దీనిపై యూఎస్, బ్రిటన్ అసంతృప్తి వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment