న్యూయార్క్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణపై చర్చకు ఐరాస సాధారణ అసెంబ్లీ ‘అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశం’ కోసం భద్రతా మండలిలో జరిగే ఓటింగ్‌కు దూరంగా ఉండాలని భారత్ నిర్ణయించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్య, చర్చల మార్గాలకు వెళ్లడం తప్ప వేరే పరిష్కారం లేదని భారత్ అభిప్రాయపడింది. జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుపై ఓటింగ్‌కు భద్రతామండలి ఆదివారం సమావేశమైంది.
ఈ ఓటింగ్‌కు ఇండియా, చైనా, యూఏఈ దూరంగా ఉండగా రష్యా వ్యతిరేకంగా ఓటు వేసింది. ఇతర 11 సభ్యదేశాలు (ఆల్బేనియా, బ్రెజిల్, ఫ్రాన్స్, గబాన్, ఘనా, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, యూకే, యూఎస్) అనుకూలంగా ఓటు వేశాయి. జనరల్ అసెంబ్లీ సమావేశంపై నిర్ణయానికి జరిగే ఈ 15 సభ్యుల భద్రతా మండలి సమావేశంలో శాశ్వత దేశాలు వీటో అధికారం ఉపయోగించే వీలు లేదు. ఓటింగ్‌కు అనుకూలంగా మెజార్టీ రావడంతో భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత ఐరాస జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. శుక్రవారం నుంచి ఉక్రెయిన్ సంక్షోభంపై జరిగిన ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండడం ఇది రెండోసారి. గత శుక్రవారం జరిగిన భద్రతామండలి సమావేశంలో పెట్టిన తీర్మానాన్ని రష్యా వీటో చేయగా, భారత్, చైనా, యూఏఈ దూరంగా ఉన్నాయి. సంక్షోభంపై శాశ్వత సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో సాధారణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది.
విచారకరం: గత సమావేశంతో పోలిస్తే ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింత దిగజారడం విచారకరమని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఓటింగ్‌పై చర్చలో అభిప్రాయపడ్డారు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారమని భారత్ నమ్ముతోందన్నారు. దౌత్యమార్గాలు, చర్చలకు వెళ్లడమే సంక్షోభానికి పరిష్కారమన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ వెల్లడించారని గుర్తు చేశారు. బెలారస్ సరిహద్దుల్లో చర్చలకు ఇరుపక్షాలు సిద్ధం కావడాన్ని భారత్ స్వాగతిస్తోందన్నారు. నాటోతో రష్యాకున్న దీర్ఘకాల విభేదాలు సైతం చర్చలతోనే పరిష్కారమవుతాయని పుతిన్‌కు మోదీ చెప్పారన్నారు. ఉక్రెయిన్‌లో భారతీయుల సంక్షేమం కోసం ఇండియా తగు జాగ్రత్తలు తీసుకుంటోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిశీలించిన అనంతరం ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
అనుసరించక తప్పదా?
సర్వసభ్య సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను సభ్యదేశాలు అనుసరించాల్సిన అవసరం ఉండదు. కేవలం భద్రతా మండలి తీర్మానాలకు మాత్రమే చట్టపరమైన హక్కు ఉంటుంది. అంటే మండలి తీర్మానాన్ని అంగీకరించని దేశంపై అంతర్జాతీయ కోర్టు ద్వారా చర్యలు తీసుకోవచ్చు. జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని అంగీకరించకపోయినా ఐరాస చేయగలిగిందేమీ ఉండదు. కానీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది.
40 ఏళ్ల తర్వాత ఐరాస ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి తొలిసారి భద్రతా మండలి పిలుపునిచ్చింది. అలాగే ఐరాస ఏర్పడ్డ తర్వాత కేవలం 11 సార్లు మాత్రమే ఇలాంటి సమావేశాలు జరిగాయి. మండలి తీర్మానాన్ని అనుసరించి సోమవారం ఉదయం(భారతీయ కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత) ప్రత్యేక జనరల్ అసెంబ్లీ మీటింగ్ జరుగుతుందని సభాధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ చెప్పారు. దశాబ్దాల తర్వాత భద్రతామండలి కీలకమైన నిర్ణయం తీసుకుందని ఐరాసలో యూఎస్ రాయబారి లిండా థామస్ చెప్పారు. రష్యాపై అసత్య ప్రచారం జరుగుతోందని, తమ సైనికులు ఉక్రెయిన్ పౌరులపై ఎలాంటి దాడులు చేయలేదని రష్యా రాయబారి నెబెంజియా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment