బెర్లిన్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో(26-28 తేదీలు) జీ-7 దేశాల సదస్సు బవేరియన్ ఆల్ప్స్‌లో జరుగనుంది. ఈ సదస్సును జర్మనీ నిర్వహిస్తోంది. అయితే, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం సందర్భంగా భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ఈ జీ-7 సమావేశాలకు జర్మనీ.. ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం లేదనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే..
ఈ వార్తలను తోసిపుచ్చుతూ భారత్‌కు ఆహ్వానం పంపిస్తున్నట్టు జర్మనీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. త‍్వరలోనే భారత్‌కు ఆహ్వానం అందనున్నట్టు పేర్కొంది. కాగా, యుద్ధం వేళ యూఎన్ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను బహిష్కరించే సమయంలో జరిగిన ఓటింగ్‌లో భారత్ పాల్గొనలేదు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో కూడా భారత్ సానుకూలంగా స్పందించింది. యుద్ధం జరుగుతున్న సయమంలోనే రష్యా విదేశాంగ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇండియాకు పలు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటన్నింటి కారణంగా ఈ ఏడాది భారత్‌కు ఆహ్వానం అందడం లేదనే వార్తలు జాతీయ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అన్నింటికి చెక్ పెడుతూ జర్మనీ కీలక ప్రకటన చేసింది.
అయితే, 2019 నుండి G7 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని వరుసగా ఆహ్వానించడం ఇది నాల్గవసారి. 2020 జూన్‌లో సమ్మిట్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా సదస్సు జరగలేదు. 2021లో యూకేలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి భారతదేశాన్ని ఆహ్వానించింది. ఆ సమయంలో యూకేలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రధాని మోదీ వర్చువల్‌గా సమ్మిట్‌లో పాల్గొన్నారు. మరోవైపు.. ఈ ఏడాది జరగబోయే జీ-7 సదస్సుకు సెనిగల్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా దేశాలను ఇప‍్పటికే జర్మనీ ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment