భారత్‌- చైనా: 5 అంశాల్లో కుదిరిన ఏకాభిప్రాయం! | India Raises Concern Over Army Deployment By China Moscow Meet | Sakshi
Sakshi News home page

రెండున్నర గంటల పాటు జైశంకర్‌- వాంగ్‌ యీ చర్చలు

Published Fri, Sep 11 2020 10:27 AM | Last Updated on Fri, Sep 11 2020 10:31 AM

India Raises Concern Over Army Deployment By China Moscow Meet - Sakshi

భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌- చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ(ఫైల్‌ ఫొటో)

మాస్కో/న్యూఢిల్లీ/బీజింగ్‌: గత కొన్ని నెలలుగా భారత్‌- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయేలా ఇరు దేశాల మధ్య ఐదు అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. రష్యా రాజధాని మాస్కోలో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సదస్సులో భాగంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌- చైనా ఫారిన్‌ మినిస్టర్‌ వాంగ్‌ యీ గురువారం సుమారుగా రెండున్నర గంటలపాటు సరిహద్దుల్లో తలెత్తిన విభేదాల గురించి చర్చించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. (చదవండి: భారత్, చైనా మధ్య ‘యుద్ధాటకం’)

ఈ సందర్భంగా.. డ్రాగన్‌ ఆర్మీ పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తీరు, భారీగా సైనిక బలగాలు, యుద్ధట్యాంకుల మోహరిస్తున్న చైనా వైఖరిపై జైశంకర్‌.. వాంగ్ యీ వద్ద అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సరిహద్దు వ్యవహారాలపై 1993, 1996లో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తే లేదని చైనా మంత్రికి భారత్‌ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే విధంగా సరిహద్దుల్లో శాంతి స్థాపన, సుస్థిరతకై సరైన చర్యలు తీసుకుంటూ ముందుకు సాగాలని జైశంకర్‌ సూచించినట్లు పేర్కొన్నాయి.( చదవండి: ఇదే చైనా కుటిల నీతి..)

భారత్‌- చైనా మంత్రుల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం
1. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పటిష్టం చేసుకుంటూ.. విభేదాలు.. వివాదాలుగా మారకుండా ఇరు వర్గాలు చొరవ చూపాలి.
2. ప్రస్తుతం సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు ఎవరికీ ప్రయోజనం చేకూర్చవు. కాబట్టి ఇరు వర్గాల సైనిక బలగాలు చర్చలు కొనసాగిస్తూ, త్వరగా ఉపసంహరణకు ఉపక్రమించి, సమదూరం పాటిస్తూ ఉద్రిక్తతలు చల్లారేలా చర్యలు తీసుకోవాలి.
3. భారత్‌- చైనా సరిహద్దు వ్యవహారాల్లో ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు, ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, శాంతి పెంపొందేలా చూడాలి. ఉద్రిక్తతలు పెరిగేలా ఎటువంటి చర్యలకు పూనుకోకూడదు.
4. సరిహద్దుల్లో తలెత్తిన పరిస్థితులపై స్పెషల్‌ రిప్రెజంటేటివ్‌ మెకానిజం ద్వారా చర్చలు కొనసాగించాలి. కన్సల్టేషన్‌, కో-ఆర్డినేషన్‌ ఆన్‌ ఇండియా- చైనా బార్డర్‌(డబ్ల్యూఎంసీసీ) తరచుగా భేటీ అవుతూ సంబంధిత అంశాలపై చర్చించాలి.
5. బార్డర్‌లో విభేదాలు సమసిపోయి, ఇరు వర్గాల్లో పరస్పరం విశ్వాసం నింపి, శాంతి, సుస్థిరత నెలకొనేలా ఇరు దేశాలు సమర్థవంతంగా పనిచేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement