India Strongly Reacts On Hindu Temples Attacks Incident in Australia - Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా: హిందూ దేవాలయాలపై దాడులు.. వ్యతిరేక రాతలు.. భారత్‌ తీవ్ర స్పందన

Published Thu, Jan 26 2023 3:03 PM | Last Updated on Thu, Jan 26 2023 3:40 PM

India Strongly Reacts On Hindu Temples Attacks Incident - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో స్వల్ప వ్యవధిలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ నెల మొదట్లో మెల్‌బోర్న్‌లోని స్వామినారాయణ్‌ ఆలయం, విక్టోరియా కర్రమ్‌ డౌన్స్‌లోని చారిత్రాత్మక శ్రీ శివ విష్ణు ఆలయం, మెల్‌బోర్న్‌లోని ఇస్కాన్‌ టెంపుల్‌పై దాడుదలు జరిగాయి. ఆలయాల గోడలపై భారత్‌కు, హిందు మతానికి వ్యతిరేకంగా రాతలను రాశారు. ఈ నేపథ్యంలో ఘటనలు జరిగి రోజులు గడుస్తున్నా దుండగులను పట్టుకోలేకపోవడంపై.. భారత్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కాన్‌బెర్రాలోని భారత హై కమిషన్‌ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, సంఘవిద్రోహ శక్తుల్ని కీర్తిస్తూ గీసిన గ్రాఫిటీల వ్యవహారం ఆందోళనకరంగా ఉందని.. ఈ దాడులను ముమ్మాటికీ కఠినంగా శిక్షించదగినదని సదరు ప్రకటనలో భారత హై కమిషన్‌ పేర్కొంది. అంతేకాదు ఈ చర్య.. ఇండో-ఆస్ట్రేలియన్‌ కమ్యూనిటీల మధ్య విద్వేషం రగిల్చేలా ఉందని పేర్కొంది. ఖలీస్థానీ అనుకూల శక్తులు ఆస్ట్రేలియాలో తమ కార్యకలాపాలను ఉధృతం చేశాయని, సిక్క్స్‌ ఫర్‌ జస్టిస్‌ లాంటి నిషేధిత ఉగ్ర  సంస్థలు, ఇతర విద్వేషపూరిత సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాయని అక్కడి ప్రభుత్వాన్ని భారత్‌ వారించింది.  

ఇప్పటికే ఆలస్యం అయ్యిందన్న కోణంలో.. దాడికి పాల్పడినవాళ్లను గుర్తించి, తగ్గ కఠిన శిక్షలు విధించాలని.. తద్వారా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావనే ఆకాంక్ష వెలువరించింది భారత హై కమిషన్‌ ప్రకటన పేర్కొంది. 

ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషన్‌ ఈ వ్యవహారంపై బదులిచ్చింది. ప్రస్తుతం విషయం దర్యాప్తులో ఉందని వెల్లడించింది. భారత్‌లాగే.. ఆస్ట్రేలియా కూడా బహుళ సంప్రదయాల దేశమని, హిందూ ఆలయాల విధ్వంసం తమనూ దిగ్భ్రాంతికి గురి చేసిందని భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌ బ్యారీ ఓఫారెల్‌ తాజాగా ట్వీట్‌ కూడా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement