ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరిగింది. శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి సందర్భంగా ఆలయం గోడలు ధ్వంసమయ్యాయి. కాగా, తాజా ఘటనతో రెండు నెలల కాలంలో ఆస్ట్రేలియాలో నాలుగు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి.
వివరాల ప్రకారం.. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. కాగా, భక్తులు శనివారం ఉదయం గుడి వెళ్లడంతో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో, ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కూడా బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌పై దాడి చేస్తామంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి వార్నింగ్ ఫోన్ కాల్స్ వచ్చాయి.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ పూజారి, భక్తులు ఈ ఉదయం తనకు ఫోన్ చేసి ఆలయ ప్రహరీపై జరిగిన దాడి గురించి చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఆలయ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ స్పందించారు. అక్కడ నివసించే హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ చేస్తున్న పద్దతిలోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీలైనంత తొందరగా ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment