ట్విట్టర్ లీగల్ అండ్ సేఫ్టీ విభాగం టీమ్ లీడర్ విజయ గద్దె(ఫైల్ ఫోటో)
ఆయన డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యానికి అధినేత ఏమైనా అనగలడు.. ట్విటర్‌లో మరీనూ... ఓడినా మనదే గెలుపన్నాడు.. ఏదేదో ట్వీట్ చేశాడు.. అభిమానులు ఇంకో అడుగు ముందుకేశారు.. క్యాపిటల్ హిల్‌పై ఏకంగా దాడికి దిగారు.. సరిగ్గా ఈ సమయంలోనే ‘పిట్ట’ పులి అయింది.. ట్రంపరితనానికి తాళం వేసింది. ఆయన మాటలు ప్రపంచానికి వినపడకుండా చేయడంలో కీలకపాత్ర వహించిన విజయ గద్దె మన తెలుగు అమ్మాయి.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఇన్‌స్టయిల్ మ్యాగజీన్ విజయను ఎంపిక చేసింది... ట్రంప్ ఖాతాను మూయించిన విజయ గురించి...
విజయ గద్దె... ఇప్పుడు ఈ పేరు... పెద్ద పెద్ద అధికారుల గుండెలను పరుగులు పెట్టిస్తోంది.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పదవిగా పేరు పొందిన అమెరికన్ ప్రెసిడెంట్ కాళ్ల కింద భూమిని కుదిపేసింది విజయ. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను విజయవంతంగా అడ్డుకున్నారు విజయ. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు... అసలు ట్విటర్ అనే మాట ట్రంప్ నోటిలో నుంచి వినపడకుండా చేసేశారు. జనవరి 8, 2021న ‘డొనాల్డ్ ట్రంప్ ట్విటర్’కు తలుపులు వేసి, తాళం పెట్టేశారు విజయ. ఇలా ఒక ప్రధాన అధికారి అధికారాలకు తాళం వేయటం ప్రపంచ చరిత్రలో బహుశ ఇదే మొదటిసారేమో అనుకుంటున్నారు. దీనితో అమెరికా అధ్యక్షుడి సోషల్ మీడియా గోడ బీటలు వారింది. ట్విటర్ కంపెనీ... న్యాయ, సిద్ధాంత, ట్రస్ట్, రక్షణ (పి.ఆర్. ఎగ్జిక్యూటివ్) విషయాలకు అధికారిగా ఉన్న విజయ గద్దె తన చేతిలోని గొడ్డలితో ఆ గోడలను పగులగొట్టారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధిస్తున్నాం. లేకపోతే ఆయన తన ట్వీట్‌ల ద్వారా మరింత హింసకు పాల్పడేలా ఉన్నారు. అదేవిధంగా మా విధివిధానాలను కూడా ఇందులో వివరించాం. మా నిర్ణయాలను మీరంతా చదువుకోవచ్చు’’ అంటున్నారు విజయ. ఇంతటి ఘాటైన చర్యకు కారణం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌లో చేస్తున్న వ్యాఖ్యలు... హింసకు దారితీస్తున్నాయి. అమెరికా మర్యాద ను బజారు పాలు చేస్తున్నాడని, ట్రంప్‌కి ఇలా జరగడమే మంచిదని అమెరికన్లు భావిస్తున్నారు.
విజయ భారతీయురాలు, మన తెలుగువారు. బాల్యంలోనే వీరి కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోవటంతో, టెక్సాస్‌లోనే పెరిగారు విజయ. విజయ తండ్రి కెమికల్ ఇంజనీర్‌గా మెక్సికోలో ఉన్న గల్ఫ్ ఆయిల్ రిఫైనరీలో పనిచేస్తుండటం వల్ల...విజయ న్యూజెర్సీలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ యూనివర్సిటీ లా స్కూల్‌లో చదువు పూర్తి చేశాక విజయ సుమారు పది సంవత్సరాల పాటు అనేక స్టార్టప్స్‌లో న్యాయ శాఖలో పనిచేశారు. 2011లో సోషల్ మీడియా కంపెనీలో చేరారు. కార్పొరేట్ లాయర్‌గా.. వీటి వెనుక ఉండే విధివిధానాల గురించి బాగా తెలుసుకున్నారు. అందువల్ల సుమారు ఒక దశాబ్దకాలంగా ట్విటర్‌ను సక్రమమైన పద్ధతిలో నడిపించటంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచం రాజకీయ నాయకులు విజయం సాధించటంలో ట్విటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుండటంతో.. విజయకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
ట్విటర్ సిఈవో జాక్ డార్సీతో విజయ గద్దె
ట్విటర్ సిఈవో... జాక్ డార్నీ భారత దేశంలో పర్యటించినప్పుడు దలైలామాను కలిసిన సందర్భంలో విజయ కూడా వారిరువురి మధ్య నిలబడి ఫొటో తీయించుకున్నారు. అందరి చూపులూ విజయ మీదే నిలిచాయి. అమెరికన్ పబ్లికేషన్స్ కూడా విజయ గురించి ప్రస్తావించటం మొదలు పెట్టాయి. రాజకీయనాయకులు విజయ గురించి... ‘‘మనం మన జీవితంలో ఇంతటి శక్తివంతమైన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గురించి ఎన్నడూ విని ఉండం’’ అంటున్నారు.
ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధిస్తూ విజయ ట్వీట్
ఇన్‌స్టయిల్ మ్యాగజీన్ అత్యంత ప్రభావితమైన మహిళల గురించి ఒక లిస్టు విడుదల చేసింది. 2020లో ‘ద బడాస్ 50’.. ‘ప్రపంచాన్ని మారుస్తున్న ఈ మహిళ ను కలవండి’ అంటూ విజయను పత్రిక ప్రశంసించింది. ట్విటర్‌లో అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న విజయ గద్దె.. ‘ఏంజెల్స్’ సంస్థలో సహ వ్యవస్థాపకురాలిగా ఉంటున్నారు. ఈ సంస్థ ద్వారా... మూల నిధులు సేకరించి, స్టార్టప్‌లకు పురుషులతో పాటు మహిళలలకు కూడా సమానంగా సహాయం అందచేస్తూ, ఆ కంపెనీలు విజయవంతంగా నడిచేందుకు సహాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment