ఈ రోజు స్నానం చేశారా? లేదా? ఈ విషయాలు తెలుసుకోండి! | International Bath Day 2021: Do You Know These Interesting Facts | Sakshi
Sakshi News home page

International Bath Day 2021: ఈ రోజు స్నానం చేశారా? లేదా?

Published Mon, Jun 14 2021 10:02 AM | Last Updated on Mon, Jun 14 2021 11:08 AM

International Bath Day 2021: Do You Know These Interesting Facts - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మీరు ఈ రోజు స్నానం చేశారా..? రోజూ చేస్తూనే ఉంటాం, ఈ రోజు స్పెషల్‌ ఏంటి అంటారా.. ఈ రోజు (జూన్‌ 14) అంతర్జాతీయ స్నానం దినోత్సవం మరి.. స్నానానికి కాస్త ఎక్కువ టైమిస్తూ, మరికాస్త ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి. ఎందుకీ రోజు జరుపుకోవడం, ఏమిటీ ఆలోచించడం, అంత ప్రాధాన్యత దేనికి అనుకుంటున్నారా..? ఈ రోజు నిజంగానే స్పెషల్‌. అటు సైన్స్‌పరంగా కీలక ముందడుగు పడిన రోజు, మన కోసం మనం కాస్త సమయం గడపాల్సిన రోజు. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?


స్నానాల తొట్టెలో.. సూత్రం పుట్టింది
ప్రఖ్యాత గ్రీకు శాస్త్రవేత్త ఆర్కిమెడిస్‌ గురించి, ఆయన కనిపెట్టిన భౌతిక శాస్త్ర, గణిత సూత్రాల గురించి మనం చిన్నప్పటి నుంచే చదువుకుని ఉంటాం. వస్తువు బరువు, పరిమాణం, సాంద్రత, స్క్రూలు, గేర్లు వంటి అంశాలపై క్రీస్తుపూర్వం 250వ సంవత్సరంలో ఆయన రూపొందించిన సూత్రాలు శాస్త్ర, సాంకేతిక రంగాలకు మార్గనిర్దేశం చేశాయి. ఇదంతా సరే.. ఈ స్నానాల తొట్టె (బాత్‌ టబ్‌)కు, ఆయనకు ఏం సంబంధం అనే డౌట్‌ వస్తోంది కదా! ఆర్కిమెడిస్‌ ఓ కీలక సూత్రాన్ని కనిపెట్టింది స్నానం చేస్తున్నప్పుడే. ఓ రోజు స్నానం కోసం బాత్‌టబ్‌లోకి దిగినప్పుడు నీళ్లు పైకి రావడాన్ని చూసిన ఆయన.. బాత్రూమ్‌లోనే కూర్చుని లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. కొన్ని కీలక అంశాలను గుర్తించాడు.ఈ ఆనందం పట్టలేక.. బాత్రూమ్‌లోంచి అలా
బట్టల్లేకుండానే ‘యురేకా’ అని అరుస్తూ వీధుల్లోకి పరుగెత్తాడట. 

ఏం కనిపెట్టాడు..  లాభమేంటి? 
బాత్‌టబ్‌లో పరిశీలనతో.. నీళ్లలో ఏదైనా వస్తువు ఎంత మేర మునిగితే, అంతే పరిమాణం లో నీళ్లు పక్కకు తొలగుతున్నట్టు ఆర్కిమెడిస్‌ గుర్తించాడు. వస్తువు వల్ల పక్కకు తొలగిన నీళ్ల బరువు.. ఆ వస్తువు బరువు కంటే ఎక్కువుంటే అది నీళ్లలో తేలుతుందని, తక్కువుంటే మునిగిపోతుందని తేల్చాడు. దీనికి వస్తువుల సాంద్రతతో లింకు ఉంటుందని గుర్తించాడు. ఏదైనా వస్తువు తొలగించిన నీటి బరువుతో సమాన బలంతో నీళ్లు ఆ వస్తువును పైకినెట్టడానికి ప్ర యత్నిస్తాయని (ఊర్ధ్వ పీడనం) తేల్చాడు. ఎన్నో ఆవిష్కరణలకు ఈ సూత్రాలు తోడ్పడ్డాయి. 

ఉదాహరణకు పడవలు, ఓడలు.. ఇనుము, ఉక్కు, కలప కలిపి భారీగా నిర్మించినా, వాటిల్లో భారీగా సామగ్రి తీసుకెళ్లినా మునగకుండా ఉంటాయి. ఆర్కిమెడిస్‌ సూత్రం ఆధారంగానే.. వాటి బరువు కంటే, ఎక్కువ నీటిని పక్కకు నెట్టేలా ఓడలను డిజైన్‌ చేస్తారు.

మన కోసం.. టైం ఇచ్చుకోవాలని..
నిజానికి ఆర్కిమెడిస్‌ పుట్టినరోజును ప్రత్యేక దినంగా నిర్ణయించాలని అనుకున్నారు. కానీ ఆ తేదీ ఏమిటనేది ఎవరికీ తెలియదు. అయితే ఆయన ఈ సూత్రాన్ని కనిపెట్టిన రోజును మాత్రం కొన్ని అంశాల ఆధారంగా జూన్‌ 14వ తేదీగా అంచనా వేశారు. అది బాత్‌టబ్‌లో కనిపెట్టాడు కాబట్టి.. ‘ఇంటర్నేషనల్‌ బాత్‌ డే’గా ప్రకటించారు. ఇలా స్నానాల రోజుగా ప్రకటించడం వెనుక ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 

స్నానం చేసేప్పుడు మనం పూర్తి ఒంటరిగా, ప్రశాంతంగా ఉంటామని వైద్య నిపుణులు చెప్తున్నారు. గోరువెచ్చని నీటిలో స్నానం చేస్తూ, శరీరం పూర్తిగా రిలాక్స్‌ అయినప్పుడు మెదడు చురుగ్గా పనిచేస్తుందని, ఆలోచనలు మెరుగుపడతాయని.. ఆర్కిమెడిస్‌ కూడా ఇలాంటి సమయంలోనే గొప్ప ఆవిష్కరణ చేశాడని అంటున్నారు. అందుకే ఈ రోజు ప్రత్యేకంగా స్నానానికి కేటాయించి, మనపై మనం దృష్టి సారించుకోవాలని సూచిస్తున్నారు. 

పిల్లల్లో సైన్స్‌పై..  ఆసక్తి పెంచేందుకు.. 
పిల్లలకు స్నానం చేయడం, నీళ్లలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదే సమయంలో వారికి సైన్స్‌ పట్ల ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ప్రయత్నించవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇంటర్నేషనల్‌ బాత్‌ డే వెనుక ఇదీ ఓ కారణమని స్పష్టం చేస్తున్నారు. పిల్లలకు బాత్‌టబ్‌లో పలురకాల బొమ్మలు ఇచ్చి.. నీళ్లు నిండి ఉండడం, ఖాళీగా ఉండటం, నీటిపై తేలడం, మునగడం, తేలికగా ఉంటే ఏమవుతుంది, బరువుగా ఉంటే ఏమవుతుంది, వంటి ఫిజిక్స్‌ సూత్రాలపై అవగాహన కల్పించవచ్చని అంటున్నారు. కొన్ని యూరప్‌ దేశాల్లో ఈ రోజున పిల్లలకు బాత్‌టబ్‌ నిండా బొమ్మలతో బహుమతులు ఇస్తుండటం ఆనవాయితీ కూడా..
 
ఈ లెక్కలతోనే.. ఏనుగును కాపాడారు 
గత ఏడాది జనవరి 30న జార్ఖండ్‌లోని ఓ గ్రామంలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. దానిని ఎలా బయటికి తీయాలా అన్న ఆలోచన చేసిన అటవీశాఖ అధికారులు.. బావిలోకి బురద నీటిని పంపారు. గున్న ఏనుగు ఆ నీటిలో తేలుతూ పైకి రాగానే బయటికి లాగి కాపాడారు. ఈ విషయంలో ఆర్కిమెడిస్‌ సూత్రాన్ని పాటించామంటూ ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేశ్‌ పాండే.. ట్విట్టర్‌లో ట్వీట్‌ కూడా చేశారు. బురద నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల.. దానికంటే తక్కువ సాంద్రత ఉండే ఏనుగు ఆ నీటిలో తేలుతుందన్న ఆలోచనతోనే అధికారులు ఇలా చేశారని చెప్పడం గమనార్హం.  
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

చదవండి: ఒత్తిడి తగ్గించుకోవడానికి 365 రోజులుగా అదే పనిలో ఉన్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement