మరణాలు లెక్కలేనంత.. నష్టం ఊహించలేనంత!! | International Day for Disaster Risk Reduction 2021 Interesting Facts Telugu | Sakshi
Sakshi News home page

విపత్తుల వినాశనం.. జయించే శక్తి లేకున్నా తగ్గించొచ్చుగా!

Published Wed, Oct 13 2021 9:00 AM | Last Updated on Wed, Oct 13 2021 12:45 PM

International Day for Disaster Risk Reduction 2021 Interesting Facts Telugu - Sakshi

International Day for Disaster Risk Reduction 2021: విపత్తులకు పరిమితి అంటూ ఉండదు. ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేరు.  ప్రపంచం మొత్తం మీద విపత్తులు ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్‌ కూడా ఉంది. ఇవి వాటిల్లినప్పుడు అన్ని వ్యవస్థల మీద, అన్నివర్గాల మీద  ప్రభావం చూపిస్తాయి. ఈ భూమ్మీద ఇప్పటిదాకా ప్రకృతి విపత్తుల కోట్ల మంది చనిపోయారు. ఒక్కోసారి ఇవి కలగజేసే నష్టం తీరనిదిగా..  కోలుకోవడానికి కొన్నేళ్లు పట్టేదిగా ఉంటుంది కూడా. 


సాధారణంగా విపత్తులు  రెండు రకాలు. ఒకటి మానవ తప్పిదం. రెండోది ప్రకృతి వల్ల జరిగేవి. కరువు, భారీ వర్షాలు, వరదలు, తుపాన్‌, సునామీ, భూకంపాలు ప్రకృతి విపత్తులు. ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల ఇవి వస్తాయి.  భూమి వేడెక్కటం(గ్రీన్‌ హౌజ్‌ ఎఫెక్ట్‌), కాలుష్యం, అడవుల నరికివేత తదితర కారణాలు మానవ తప్పిదాలు.  ఈ రెండు రకాల విపత్తులు ప్రాణ, ఆస్తి, పర్యావరణ నష్టాలకు కారణం అవుతుంటాయి. కరోనా లాంటి మహమ్మారులను సైతం విపత్తులుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పుడు. 



ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ  2009, డిసెంబర్ 21న ఒక ప్రతిపాదన చేసింది. ప్రతియేటా అక్టోబర్ 13ను అంతర్జాతీయ విపత్తు కుదింపు(తగ్గింపు) దినోత్సవాన్ని International Day for Disaster Risk Reduction అధికారికంగా పాటించాలని నిర్ణయించింది. కానీ, 
 



1989లోనే మొదటి దినోత్సవాన్ని పాటించారు. విపత్తులను తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు, రిస్క్‌ అవేర్‌నెస్‌ గురించి ప్రమోట్‌ చేస్తుంది ఈ దినోత్సవం. మొదట్లో నేచురల్‌ డిజాస్టర్‌ రెడక్షన్‌ డేగా ఉండేది. 2002లో ఓ రెజల్యూషన్‌ పాస్‌ చేసింది ఐరాస. ఆపై 2009లో అధికారికంగా ప్రకటించడంతో పాటు International Day for Natural Disaster Reduction  పేరును International Day for Disaster Reductionగా మార్చేసింది. 

విపత్తు నిర్వహణ
విపత్తులు సంభవించాకే సహాయక చర్యలు మొదలుపెట్టాలి. ‘విపత్తు నిర్వహణ అంటే ఇంతే’..  అని ఒకప్పుడు అనుకునేవాళ్లు. గతంలో మన దేశంలో విపత్తులుచాలా సంభవించాయి. ఆయా సందర్భాల్లో కీలక పాత్ర పోషించింది పునరావాస విభాగాలే.  అయితే విపత్తును ముందే అంచనా వేసి జాగ్రత్తలు తీసుకోలేమా?. ఈ దిశగా  ఐక్యరాజ్య సమితి 1990లో ఒక తీర్మానం చేసింది. ఆ దశాబ్దం మొత్తాన్ని   ‘అంతర్జాతీయ విపత్తుల తగ్గింపు’ దశాబ్దంగా ప్రకటించింది. ‘విపత్తు నిర్వహణ అంటే..  ఆపదలు వచ్చాక సాయం చేయటం మాత్రమే కాదు.  రాకముందే పరిస్థితిని అంచనా వేయాలి.  ముందస్తు చర్యలు చేపట్టాలి.  లోపాలను అధిగమించాలి. ఒకవేళ విపత్తులు వస్తే త్వరగతిన సాయం అందించాలి. ఇందుకోసం టెక్నాలజీ సాయం తీసుకోవడంతో పాటు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా నష్టాన్ని తగ్గించుకోవచ్చు’.. ప్రపంచ దేశాలకు ఐరాస సూచించింది ఇదే.      



2017 World Conference on Disaster Risk Reductionలో సెండాయ్‌(జపాన్‌) సెవెన్‌ క్యాంపెయిన్‌ను ప్రతిపాదించారు. 2030కల్లా విపత్తులతో ప్రభావితం అయ్యే ప్రజల సంఖ్యను తగ్గించాలనేది ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం
 



మన దగ్గర..
భారత్‌లో విపత్తు నిర్వహణ ప్రయత్నాలు 1990లో ఊపందుకున్నాయి. కానీ, చట్టం వచ్చింది మాత్రం 2005లో.  విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం, రాష్ట్రం, జిల్లా స్థాయిల్లో విపత్తు నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయా విభాగాలకు చైర్మన్లు. ఇవి ఏర్పడ్డాక  విపత్తులను ఎదుర్కొనేందుకు అనుసరించే వ్యూహం, సహాయక చర్యల్లో  చాలా మార్పు వచ్చింది.  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు.  దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి విపత్తు సంభవించినా  ఎన్డీఆర్‌ఎఫ్‌(సైన్యం) తక్షణం రంగంలోకి దిగుతుంది.  మరోవైపు విపత్తుల నివారణపై ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ లోటుపాట్లతో నష్టం జరుగుతూనే ఉంది.


థీమ్‌
Disaster Risk Governance.. 2021 ఏడాది కోసం ఇచ్చిన థీమ్‌ పిలుపు. కరోనాతో లక్షల మంది(కోట్ల మంది!) చనిపోయారు. ఈ నేపథ్యంలో విపత్తుల ప్రభావం తగ్గించే పరిపాలన మీద దృష్టిసారించాలని ప్రభుత్వాలకు చెబుతోంది ఈ థీమ్‌. 


లోపాలు
ఇండియాలో 2001–21 మధ్య కాలంలో విపత్తుల మూలంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని రీతిలో ఆస్తి నష్టం వాటిల్లింది.  ఐదేళ్ల క్రితం ‘జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక’ అనుకున్నప్పటికీ.. అది విఫలమైంది. అంతెందుకు మూడేళ్ల క్రితం వచ్చిన కేరళ వరదలనే చూసుకుంటే.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి కేరళకు ముందస్తు హెచ్చరికలేవీ చెయ్యలేదన్న విమర్శలు వినిపించాయి. అదే సమయంలో వర్షాలు, వరదలను కేరళ ప్రభుత్వం అంచనా వేయలేకపోయిందని, డ్యాముల నుంచి నీటిని ఆలస్యంగా విడుదల చేసిందని ప్రతివిమర్శలు వచ్చాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందని వేసుకుని చేతులు దులుపుకున్నారు. ఇక్కడ కామన్‌ పాయింట్‌ మాత్రం నిర్వహణ లోపమే. 



జాతీయ విపత్తు
విపత్తు నిర్వహణ చట్టంలో లొసుగులూ ఉన్నాయి. ఇవి చూపిస్తూ కేంద్ర ప్రభుత్వాలు..  రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపిస్తుంటాయి.  ఉదాహరణకు.. కేరళ వరదలను ‘జాతీయ విపత్తి’గా కేంద్ర ప్రకటించకపోవడానికి కారణం కూడా ఇదే.  విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం.. మహా విపత్తు, మానవ తప్పిదాల వల్ల భారీ తప్పిదాలు జరిగాలి. ఆ పరిస్థితిని అంచనా వేసి కేంద్రం ‘జాతీయ విపత్తు’గా ప్రకటిస్తుంది. కానీ, సహజ విపత్తులను ఖచ్ఛితంగా జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న రూలేం చట్టంలో లేదు. అసలు సహజ విపత్తులు అంటే ఏంటో తేల్చేందుకు 2001లో అప్పటి ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆనాటి ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని కమిటీ ఎలాంటి సూచనలు చెయకుండానే డిజాల్వ్‌ అయ్యింది. రాష్ట్రాలకు ఇదే మైనస్‌గా మారింది. అయితే విమర్శలు వచ్చినప్పుడల్లా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దింపి, ఏదో మొక్కుబడి ఆర్థిక సాయం ఇచ్చి చేతులు దులుపుకుంటోంది కేంద్రం.


విపత్తులు/ఆపదలు చెప్పి రావు. ఆకస్మాత్తుగా వస్తాయి. మానవ తప్పిదాలతో జరిగే విపత్తులను అరికట్టొచ్చు. కానీ,  ప్రకృతి విపత్తులను పూర్తిగా జయించే శక్తి మనకు లేదు. ఎదుర్కొవటానికి.. తీవ్రతను తగ్గించడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలి!.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణను ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాలి. అత్యున్నత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మున్ముందు కూడా అంతులేని నష్టం జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

చదవండి: చిట్టితల్లి భయపడకు.. అలా ఎవరైనా టచ్‌ చేస్తే చెప్పేయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement