తాలిబన్ల ‘కే’ తలనొప్పి | Islamic State-Khorasan enemy of Talibans | Sakshi
Sakshi News home page

Afghanistan Crisis-ISIS K: తాలిబన్ల ‘కే’ తలనొప్పి

Aug 31 2021 4:27 AM | Updated on Aug 31 2021 1:04 PM

Islamic State-Khorasan enemy of Talibans - Sakshi

తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్‌ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్‌– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి పరిణామాలు తాలిబన్లకు కలిగిస్తున్న ఆనందాన్ని ఐసిస్‌–కే దాడులు ఆవిరిచేస్తున్నాయి.

ఘనీ ప్రభుత్వం దిగిపోయినందుకు ఆనందించాలా? ఆ ప్రభుత్వ స్థానంలో కూర్చోబోతున్న తమకు ఎదురవుతున్న సవాళ్లకు భయపడాలా? అర్థం కాని పరిస్థితి తాలిబన్లలో నెలకొంది. ఐసిస్‌–కే నిర్వహించిన కాబూల్‌లో బాంబు దాడి, ఎయిర్‌పోర్టుపై రాకెట్‌ దాడులు వంటివి తాలిబన్లను ఆందోళన పరుస్తున్నాయి. తాలిబన్లు కూడా ఐసిస్‌–కే లాగానే షరియాకు కట్టుబడి పాలన సాగించే గ్రూపు. మరి అలాంటప్పుడు వీరితో వారికి ఎందుకు వైరం వస్తుందని చాలామంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు ఇరు గ్రూపుల లక్ష్యంలో భేదాలే కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  
(చదవండి: సర్కారీ బడుల్లో చదివించే టీచర్లకు అవార్డులు )

2015లో బీజాలు
అఫ్గాన్‌లో ఐసిస్‌ ప్రతినిధిగా ఐసిస్‌– ఖొరసాన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఐసిస్‌ 2015లో ప్రకటించింది. వెంటనే ఈ గ్రూపుపై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు. తాలిబన్లు అఫ్గాన్‌లో షరియా ఆధారిత పాలనా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆవిర్భవించిన గ్రూపు. తాలిబన్ల ఎజెండా అఫ్గాన్‌కే పరిమితం. విదేశీయుల నుంచి అఫ్గాన్‌కు విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటారు. కానీ ఐసిస్‌ లక్ష్యం అఫ్గాన్‌తో ఆగదు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో అన్ని ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీఫత్‌ (ఇస్లామిక్‌ రాజ్యం) ఏర్పాటు ఐసిస్‌ ప్రధాన లక్ష్యం. ఇందువల్లనే తాలిబన్లకు, ఐసిస్‌కు భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. తాలిబన్లు పాకిస్తాన్‌ చేతిలో కీలుబొమ్మలని, అఫ్గాన్‌లో ఆధిపత్యం కోసం పాక్‌ సృష్టించిన గ్రూపని ఐసిస్‌ విమర్శిస్తోంది.

పాక్‌ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసిరావాలని తాలిబన్లను ఐసిస్‌–కే డిమాండ్‌ చేసింది. ఐసిస్‌–కే ఆరోపణలను తాలిబన్లు తోసిపుచ్చారు. అఫ్గాన్‌లో జిహాద్‌కు తాము సరిపోతామని, సమాంతరంగా మరో గ్రూపు అవసరం లేదని, ఐసిస్‌–కే తమ కార్యకలాపాలను నిలిపివేసి అఫ్గాన్‌ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో మండిపడ్డ ఐసిస్‌ ఖలీఫత్‌లో చేరని కారణంగా తాలిబన్లపై జాలి చూపవద్దని ఐసిస్‌–కేను ఆదేశించింది. మొత్తం ఖలీఫత్‌కు ఒకరే అధినేత (ఖలీఫా/అమిర్‌) ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్‌ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్‌–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015లోనే పిలుపిచ్చింది. 
(చదవండి: వైరల్‌: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు)

ఏం జరగవచ్చు
ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్‌లో చాలా భాగం తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. దేశంలో సుదీర్ఘ పౌరపోరాటానికి ఈ గ్రూపు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విమానాశ్రయం వద్ద బాంబుదాడులు జరిపింది. అమెరికా దళాలు వైదొలిగాక ఈ గ్రూపు మరిన్ని దాడులు చేయవచ్చన్న భయాలున్నాయి. ఐసిస్‌–కేను తాము ఎదుర్కొంటామని, అమెరికా సాయం అవసరం లేదని, అందువల్ల అమెరికా దళాలు పూర్తిగా వెళ్లిపోవాలని తాలిబన్లు ప్రకటించారు. మరోవైపు అమెరికా దళాల ఉపసంహరణను జాప్యం చేయాలని ఐసిస్‌ భావించింది. దీనివల్ల తాలిబన్లు– అమెరికన్ల పైనే ఎక్కువగా దృష్టిపెట్టి బిజీగా ఉంటారని, ఈ మధ్యలో తాము పైచేయి సాధించవచ్చని ఐసిస్‌ యోచిస్తున్నట్లు రక్షణ నిపుణుల అంచనా.

ఇస్లాం ఆచరణలో తేడాలు
తాలిబన్లు, ఐసిస్‌ గ్రూప్‌ రెండూ జీహాద్‌ ద్వారా ఇస్లామిక్‌ సామ్రాజ్య ఏర్పాటుకు యత్నించేవే అయినా, ఇస్లాంను అర్ధం చేసుకోవడంలో రెండు గ్రూపుల మధ్య బేధాలున్నా యి. తాలిబన్లలో ప్రధానంగా ఫష్తూన్‌ తెగకు చెందిన వారుంటారు. వీరు సున్నీ ఇస్లాంకు చెందిన హనఫీ మార్గాన్ని అవలంబిస్తారు. తాలిబన్లు దియోబంది మార్గ ప్రవచనాలను పాటిస్తారు. ఐసిస్‌ సున్నీ ఇస్లాంలోని వహాబీ/సలాఫి మార్గాన్ని పాటిస్తుంది. సూఫీ మార్గంపై తాలిబన్లకు నమ్మకం ఉండగా, ఐసిస్‌కు సూఫిజం గిట్టదు. ఇస్లాంలో మరో వర్గం షియా ముస్లింలను ఐసిస్‌ కాఫిర్లు(ద్రోహులు)గా భావిస్తుంది. సూఫీ మార్గాన్ని తిరస్కరిస్తూ ఐసిస్‌  ఫత్వాలు జారీ చేయగా, ఐసిస్‌ను వ్యతిరేకిస్తూ తాలిబన్లు ఫత్వాలు జారీ చేశారు.
– నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement