హెజ్బొల్లా Vs ఇజ్రాయెల్‌.. తెరపైకి డేంజరస్‌ ‘కత్యూషా’ | Israel And Hezbollah Exchange Heavy War Fire | Sakshi
Sakshi News home page

హెజ్బొల్లా Vs ఇజ్రాయెల్‌.. తెరపైకి డేంజరస్‌ ‘కత్యూషా’

Published Mon, Aug 26 2024 7:57 AM | Last Updated on Mon, Aug 26 2024 8:47 AM

Israel And Hezbollah Exchange Heavy War Fire

జెరూసలేం: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్‌ గ్రూపు మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇక, తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో 48 గంటల పాటు దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించారు. దాదాపు వందల సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లాయి.

కాగా, గత నెలలో తమ టాప్‌ కమాండర్‌ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ భూభాగంపైకి వందలాది సంఖ్యలో రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూపు ప్రకటించింది. ఉత్తర ఇజ్రాయెల్‌, గోలన్‌ హైట్స్‌లోని ఆ దేశ సైనిక స్థావరాలు, ఐరన్‌ డోమ్‌ లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లు, భారీ సంఖ్యలో డ్రోన్లను హిజ్బొల్లా ప్రయోగించింది. ఈ సందర్భంగా తమ నేత హత్యకు ప్రతీకారంగా మొదటి దశ దాడులను ముగించినట్టు హిజ్బొల్లా చెప్పుకొచ్చింది. అలాగే, భవిష్యత్‌ కాలంలో మరిన్ని తీవ్రమైన దాడులు ఉంటాయని హెచ్చరించింది.

 

 

మరోవైపు.. హెజ్బొల్లా దాడులను అడ్డుకొనేందుకు దక్షిణ లెబనాన్‌లోని వేలాది రాకెట్‌ లాంచర్లను లక్ష్యంగా చేసుకొని దాదాపు 100 యుద్ధ విమానాలు వైమానిక దాడులు చేశాయని ఇజ్రాయెల్‌ పేర్కొన్నది. ఇక, కేవలం సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్టు హెజ్బొల్లా గ్రూపు, ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ముగ్గురు మరణించారని, ఇద్దరికి గాయాలయ్యాయని లెబనాన్‌ అధికారులు పేర్కొనగా, స్వల్ప నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నామని ఇజ్రాయెల్‌ సైనిక అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. కాగా, హెజ్బొల్లా వద్ద దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నాయని, ఇజ్రాయెల్‌లోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగల సామర్థ్యం ఆ గ్రూపునకు ఉన్నదని ఒక అంచనా.

 

 

హిజ్బొల్లా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా నెతన్యాహు మాట్లాడుతూ.. మా దేశాన్ని రక్షించుకొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటాం. మాపై ఎవరు దాడి చేస్తారో, వారిపై మేం దాడి చేస్తాం. ఉత్తర ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించిన వేలాది రాకెట్లను సైన్యం అడ్డుకొన్నదని ఆయన పేర్కొన్నారు. సైన్యం సూచనలను పాటించాలని పౌరులను కోరారు.  

హెజ్బొల్లా వద్ద డేంజరస్‌ ‘కత్యూషా’
హెజ్బొల్లా వద్ద రాద్, ఫజర్, జిల్‌జాల్‌ మోడల్‌ రాకెట్లు ఉన్నాయి. వీటిలో శక్తిమంతమైన పేలోడ్లు ఉన్నాయి. ఇవి కత్యూషా క్షిపణుల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఇక, హెజ్బొల్లా గ్రూపు అమ్ములపొదిలో ‘కత్యూషా’ అనేది ప్రధాన ఆయుధంగా ఉన్నది. ఆదివారం నాటి ఘర్షణల్లో వీటికి చెందిన 300 రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించినట్లు అంచనా.రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్లు దీన్ని తయారు చేశారు. కత్యూషా రాకెట్లు భారీ వార్‌హెడ్‌లను సుదూర లక్ష్యాలపైకి ప్రయోగించగలవు. ఏకకాలంలో వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే అవకాశం ఉండటంతో శత్రు లక్ష్యాలను నాశనం చేయగలవు. వీటిని కొన్ని రకాల రహస్య లాంచర్లపై ఉంచి గుర్తు తెలియని ప్రదేశాల నుంచి హెజ్బొల్లా ప్రయోగిస్తుంది. 2006లో లెబనాన్‌ యుద్ధంలో వీటిని భారీ ఎత్తున వినియోగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement