ప్రామిస్డ్‌ ల్యాండ్‌: ‘సారా పాలిన్‌ ఎవరు?’ | Joe Biden Asked Obama Who The Hell Is Sarah Palin | Sakshi
Sakshi News home page

ఒబామా ప్రామిస్డ్‌ ల్యాండ్‌ నుంచి ఆసక్తికర అంశాలు

Published Mon, Nov 16 2020 2:51 PM | Last Updated on Mon, Nov 16 2020 3:27 PM

Joe Biden Asked Obama Who The Hell Is Sarah Palin - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన రాజకీయ అనుభవాల గురించి వెల్లడించిన ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్’‌ పుస్తకం మార్కెట్లోకి రాకముందే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిలో రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీల గురించి ఒబామా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలో ఈ పుస్తకంలోని మరి కొన్ని అంశాలు తాజాగా ఆసక్తికరంగా మారాయి. 2008 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ పార్టీ తరఫున ఒబామా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జో బైడెన్‌ని తన సహచరుడిగా ఎన్నుకోవడం పట్ల పడిన ఆందోళన గురించి ఇందులో రాసుకొచ్చారు. ఎక్కువగా మాట్లాడడు.. స్వీయ అవగాహన లేదు.. ఇద్దరం చాలా వేర్వేరుగా ఉండే వాళ్లం. కానీ అతడి మంచి మనసు, విదేశాంగ విధానం, కష్టపడి పని చేసే స్వభావం అనతి కాలంలోనే అతడిపై నా అభిప్రాయాన్ని మార్చేశాయి అనితెలిపాడు. ఇక 2008లో రిపబ్లికన్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటి పడిన సారా పాలిన్‌ గురించి కూడా ఒబామా తన పుస్తకంలో వివరించారు. (రాహుల్‌ గాంధీకి ఆ పట్దుదల లేదు : ఒబామా)

‘డెమొక్రాట్ల తరఫున జో బైడెన్‌ని ఉపాధ్యక్షుడిగా ప్రకటించాము. ఇక రిపబ్లికన్‌ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి ఎవరు బరిలో నిలవబోతున్నారో తెలుసుకునేందుకు నేను, బైడెన్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇంతలో జాన్ మెక్కెయిన్‌ ఉపాధ్యక్ష పదవికి సారా పాలిన్‌ని ఎన్నుకున్నట్లు తెలిసింది. దీని గురించి బైడెన్‌కి మెసేజ్‌ చేశాను. సారా పాలిన్‌ ఎవరు అంటూ బైడెన్‌ నన్ను అడిగారు’ అని తన పుస్తకంలో వివరించారు ఒబామా. ఇక పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ప్రకటించడం పట్ల తాను కొంత ఇబ్బంది పడినట్లు ఒబామా వెల్లడించారు. ఇక ఈ ఎన్నికల్లో పాలిన్‌ ఎంతో ఆసక్తి క్రియేట్‌ చేశారని.. ఆమె ఎందరో ఓటర్లని ప్రభావితం చేయగలదని మొదట తాను భావించానన్నారు ఒబామా. అయితే అతి త్వరలోనే పాలిన్‌ గురించి తాము మరీ అంత కలత చెందాల్సిన అవసరం లేదని.. దేశాన్ని పాలించే అంశాల గురించి ఏ మాత్రం అవగాహన లేదనే విషయం పాలిన్‌ మాటల్లో ధ్వనించేది అన్నారు ఒబామా. ‘పాలిన్‌ని ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకోవడంలో అత్యంత ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే ఇది దేశ రాజకీయాల దిశను మార్చింది. పాలిన్ అసమర్థత రిపబ్లికన్‌ పార్టీని "లోతైన స్థాయిలో ఇబ్బంది పెడుతోంది ... అయితే దీని గురించి చాలా మంది రిపబ్లికన్లకు పట్టింపు లేదు." ఆమె సమస్యల పరిజ్ఞానాన్ని పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తే "ఉదారవాద కుట్రకు రుజువుగా" ప్రచారం చేశారు’ అని ఒబామా తన పుస్తకంలో వెల్లడించారు. (ట్రంప్‌పై విమర్శలు: ఒబామా ఆడియో లీక్‌)

అయితే దీనిపై స్పందిస్తూ పాలిన్ శుక్రవారం తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక కామెంట్‌ పోస్ట్ చేశారు. ఇక​ దీనిలో ఆమె రిపబ్లికన్ రాజకీయాలను తీర్చిదిద్దినందుకు ఒబామాకు కృతజ్ఞతలు తెలుపుతూ, "గత పన్నెండు సంవత్సరాలుగా నేను మీ తలలో అద్దె లేకుండా ఉచితంగా జీవించానని తెలుసుకోవడం ఆనందంగా ఉంది" అన్నారు పాలిన్‌. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’ నవంబర్‌ 17న విడుదల కానుంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఒబామా, ఆయన భార్య మిషెల్‌ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్‌ ఇప్పటికే ‘బికమింగ్‌’పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement