వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు బైడెన్‌ను ప్రశంసిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం తప్పుకొని నిస్వార్థంగా వ్యవహరించాలని కొనియాడుతున్నారు. మరోవైపు.. ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ కూడా బైడెన్ నిర్ణయాలన్ని స్వాగించారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడంపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. ‘‘బైడెన్ నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతుంది. రెండోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడు. అధ్యక్షుడిగా బైడెన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా గొప్పతనాన్ని చాటిచెప్పారు. నాటోను పునరుజ్జీవింపజేశారని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారు’’ అని ఒబామా కొనియాడారు.
ఇదే సమయంలో కమలా హారీస్ అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఒబామా మాత్రం ఇప్పటివరకు ఆమెకు మద్దతుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకురావాలని పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా.. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురుకాబోతున్నాయని, డెమోక్రటిక్ పార్టీ శ్రేణులను ఒబామా అప్రమత్తం చేశారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష బరి నుంచి బైడెన్ తప్పుకోవడంతో డెమోక్రటిక్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతోంది. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో అయోమయ పరిస్థితి నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారనే చర్చ తీవ్రతరమైంది. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులో అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఈ సందర్భంగా 4,700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతోపాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే. ఇక, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే హారీస్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment