నిజ్జర్ హత్యపై వెనక్కి తగ్గిన ట్రూడో
విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు హాజరు
న్యూఢిల్లీ: ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌సింగ్‌నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయముందని ఊదరగొట్టిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వెనక్కితగ్గారు. ఈ హత్యకు సంబంధించి నిఘా సమాచారాన్ని మాత్రమే భారత్‌తో పంచుకొన్నామని, ఎలాంటి ఆధారాలను అందజేయలేదని విదేశీ జోక్యపు ఎంక్వైరీ ముందు బుధవారం హాజరైనపుడు అంగీకరించారు.
నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయముందని కెనడా ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిని.. దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్లిన విషయం తెలిసిందే. ‘భారత్‌ను సహకరించాల్సిందిగా కోరాం. ఆధారాలు చూపమన్నారు. భారత నిఘా సంస్థలు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి మాకు సహకరించాలని కోరాం. ఎందుకంటే ఈ దశలో కెనడా దగ్గరున్నది కేవలం నిఘా సమాచారం మాత్రమే’ అని ఎంకైర్వీ ముందు ట్రూడో చెప్పుకొచ్చారు.
‘జి20 సమావేశాల ముగింపు సమయంలో నేనీ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తెచ్చాను. భారత్ ప్రమేయముందని మాకు తెలుసని చెప్పాను. కెనడాలో చాలామంది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వారందరినీ అరెస్టు చేయాలని కోరారు. జి20 సదస్సు నుంచి కెనడాకు తిరిగి వచ్చేసరికి భారత్ అసలు ఉద్దేశం సుస్పష్టమైంది. కెనడాను విమర్శించడం, మన ప్రజాస్వామ్యపు సమగ్రతను ప్రశ్నించడమే వారి అసలు ఉద్దేశం’ అని ట్రూడో ఎంక్వైరీ ముందు చెప్పారు.
లేవంటూనే.. మళ్లీ పాతపాట
నిఘా సమాచారం తప్పితే.. గట్టి ఆధారాలు అందజేయలేదని ఒకవైపు చెబుతూనే ట్రూడో మళ్లీ పాతపాట పాడారు. నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని ఎంక్వైరీ కమిటీ ముందు ట్రూడో బుధవారం పునరుద్ఘాటించారు. భారత రాయబారులు కెనడా పౌరుల సమాచారం సేకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఇవే ఆరోపణలు చేసినపుడు భారత్ గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై ఏ చిన్న ఆధారాన్ని కూడా కెనడా అందజేయలేదని విదేశాంగశాఖ పేర్కొంది. పలుమార్లు విజ్ఞప్తి చేసిన కెనడా స్పందించలేదని దుయ్యబట్టింది. కెనడా గడ్డపై వేర్పాటువాద శక్తులను కట్టడి చేయడానికి ఆ దేశం ఏమీ చేయడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కొట్టిపారేసింది.
Comments
Please login to add a commentAdd a comment