రఫా(గాజా స్ట్రిప్): కదనరంగంలో తమను దీటుగా ఎదిరించే సత్తా హమాస్ సాయుధులకు లేదని అతివిశ్వాసంతో ఉన్న ఇజ్రాయెల్ సేనలు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో ముగ్గురు అమాయక బందీలు బలైపోయారు. హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిని హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం తర్వాత తీరిగ్గా చెప్పింది. ఉత్తరగాజాలోని షెజాయా పట్టణంలో హమాస్ మిలిటెంట్లుగా భావించి వారిపై కాల్పులు జరిపామని ఇజ్రాయెల్ సైన్యం(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ చెప్పారు.
దాడి వివరాలను మరో ఉన్నతాధికారి వెల్లడించారు. ‘ ఇజ్రాయెల్ దాడికి భయపడి ఈ ముగ్గురినీ బంధించిన హమాస్ మిలిటెంట్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఈ ముగ్గురు బందీలు చొక్కాలు విప్పేసి తెల్ల జెండాలు ఊపుతూ భవనం బయటకు వచ్చారు. అయినాసరే సైన్యం వీరిపైకి తుపాకీ గుళ్ల వర్షం కురిపించింది. దీంతో ఇద్దరు మరణించారు.
మూడో వ్యక్తి ప్రాణభయంతో మళ్లీ భవంతిలోపలికి ఏడుస్తూ పరుగెత్తాడు. అయినాసరే సైన్యం కాల్పులు జరపడంతో అతనూ మరణించాడు’’ అని సైన్యాధికారి ఒకరు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని ఇజ్రాయెల్‌కు చెందిన యోటమ్ హైమ్(28), సమీర్ తలాల్కా(22), అలోన్ షామ్‌రిజ్(26)గా గుర్తించారు. ఈ ఘటనపై దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment