లోపాన్ని ఆత్మవిశ్వాసం మాటున దాచేయడమే అందం..ఆత్మబలంతో బలహీనతను గల్లంతు చేయడమే విజయం..ఆ అందం, ఈ విజయానికి పోతపోసిన రూపం ‘మహాగనీ గెటర్’! రంగు– రూపు, ఒడ్డు–పొడుగు అనే స్టిరియోటైప్ బ్యూటీ డెఫినెషన్‌ను ఎడమకాలుతో తన్నింది! ఆత్మస్థయిర్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయింది.. పుట్టుకతో వచ్చిన అనారోగ్యాన్ని అందంగా కేరీ చేస్తోంది.. ధైర్యానికి మోడల్‌గా ఆమెను ఎంతోమంది అభిమానిస్తున్నారు అంతకంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు.
మహాగనీ గెటర్ .. వయసు 23 ఏళ్లు. అమెరికా, టెన్నెసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్ నివాసి. ముగ్గురు అక్కాచెల్లెళ్ళలో తనే పెద్దది. గెటర్ పెరుగుతున్న కొద్దీ ఆమె ఎడమ చేయి, కాలు అసహజంగా పెరుగుతూ వచ్చాయి. డాక్టర్లకు చూపిస్తే ‘లింఫడీమా’ అనే వ్యాధే కారణం అని తేల్చారు. అది గెటర్‌కు పుట్టుకతోనే ఉన్నట్టు నిర్థారించారు. ‘ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమంటూ లేదు. కాలులో ఏర్పడే ద్రవాలను తీసివేయడం, మసాజ్ చేయడం, ఫిజయోథెరపీతో ఉపశమనం పొందడమనే తాత్కాలిక చికిత్స తప్ప’ అని చెప్పారు డాక్టర్లు.
తన ఈడు వాళ్లతో చురుగ్గా ఆడుకోలేక, వేగంగా పరిగెత్త లేక.. లోపల్లోపలే కుమిలిపోయేది. టీన్స్‌లోకి అడుగుపెట్టాకయితే తన కాలు ఒక శాపంలా అనిపించేది ఆమెకు. అందరిలా తనెందుకు లేదనే బాధ తనను తాను అసహ్యించుకునేలా చేసింది. అయినా మనసులో ఏదో కసి.. పట్టుదల.. ఆ అనారోగ్యాన్ని చిన్నబుచ్చాలని. అందుకే డాక్టర్ల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. కాపాడుకుంటోంది కూడా.
లింఫ్ డాట్ గాడెస్23
ఆరోగ్యం ఇచ్చిన ధైర్యం ఆమెలో కొత్త ఆలోచనలను రేపింది. సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేసుకుంది. లింఫడిమా ఆన్‌లైన్ కమ్యూనిటీలతో కనెక్ట్ అయింది. కొత్త విషయాలను తెలుసుకుంది. తన అనుభవాలను పంచుకుంది. ఆత్మవిశ్వాసం పెంచుకుంది. దాంతో సోషల్ మీడియాను తన ప్రతిభకు ఎలా డయాస్‌గా మలచుకోవచ్చో అర్థం చేసుకుంది. కొత్త కొత్త కంటెంట్లు, టిక్‌టాక్‌లు వంటివి పోస్ట్ చేయసాగింది. వాటికి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసరికి ఆమెలో ఉత్సాహం ఇనుమడించింది.
దాంతో ‘లింఫ్ డాట్ గాడెస్ 23’ అనే పేరుతో ఇన్‌స్టాలోనూ అకౌంట్ తెరిచింది. అందులో తన ఫ్యాషన్ ఫొటోలు పెట్టి చూసింది. దానికీ ఫాలోవర్లు పెరిగారు ఆమే ఆశ్చర్య పోయేలా. నెగటివ్ కామెంట్స్‌నూ అందుకోలేక పోలేదు ఆమె. ఎడమచేత్తో వాటిని కొట్టిపడేసింది. ఇప్పుడు ఆమె ‘లింఫ్ డాట్ గాడెస్ 23’కి తొమ్మిదివేల మందికి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఆమె 136 కేజీల బరువుంది. అందులో ఆమె ఎడమకాలి బరువే 45.3 కేజీలట.
శపించాడనుకుని...
‘నన్ను దేవుడు శపించాడు అనుకుంటూ సెల్ఫ్ పిటీలోనే బాల్యం వెళ్లదీశాను. అనారోగ్యానికి భయపడినంత కాలం సెల్ఫ్ పిటీ మనల్ని మింగేస్తుందని ఎప్పుడైతే గ్రహించానో అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. అదే నాకు మానసిక బలాన్నిచ్చింది. నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది. ఐ యామ్ బ్యూటిఫుల్ అని తెలుసుకున్నాను. ఇన్‌స్టాలోని నా ఫ్యాషన్ ఫొటోస్‌ను ముందుగా ఎంకరేజ్ చేసింది మా అమ్మే. తర్వాత ఆన్‌లైన్ లింఫడీమా కమ్యూనిటీ. నా ఈ అందమైన జర్నీలో వాళ్లందరూ భాగస్వాములే’ – మహాగనీ గెటర్
లింఫడీమా అంటే..
శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో భాగమైన లింఫాటిక్స్‌లో కొన్ని సందర్భాల్లో జన్యు ఉత్పరివర్తనాల కారణంగా అవరోధాలు ఏర్పడతాయి. దీంతో∙లింఫాటిక్స్‌లో ఉన్న ద్రవాలు శరీరంలోని మిగతా భాగాల్లోకి చేరి అక్కడ వాపునిస్తాయి. దీనినే లింఫడీమా అంటారు. ముఖ్యంగా చేతులు, కాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమందిలో రెండు కాళ్లు, రెండు చేతుల్లోనూ కనిపిస్తుంది. లింఫడీమాకు శాశ్వత వైద్య పరిష్కారం రాలేదింకా.. నియంత్రణా ట్రీట్మెంట్లు మాత్రమే ఉన్నాయి.
-పి. విజయా దిలీప్
Comments
Please login to add a commentAdd a comment