ఫ్లోరిడా: మియామీలో బహుళ అంతస్తుల భవనం అపార్ట్‌మెంట్లు కుప్పకూలడం పెనువిషాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటికే శకలాల నుంచి ఐదు మృతదేహాల్ని వెలికి తీశారు. మరో 156 మంది ఆచూకీని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. అయితే ఈ విషాద ఘటనలో కుట్ర కోణం దాగుందని కొందరు భావిస్తున్నారు. టెక్ దిగ్గజం జాన్ మెక్‌అఫీతో ఈ ఘటనకు ముడిపెడుతూ.. పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మెక్‌అఫీ యాంటీ వైరస్ సృష్టికర్త జాన్ మెక్‌అఫీ ఈమధ్యే జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం తెలిసిందే. అయితే చనిపోయే ముందు ఆయనొక ఇంపార్టెంట్ ట్వీట్ చేశాడని.. దానిని తెరమీదకు తెచ్చారు కొందరు. ‘‘నాకేదైనా జరిగితే.. ఫ్లోరిడా సర్ఫ్‌సైడ్ మియామీ బీచ్ కొల్లిన్స్ అవెన్యూలో ఉన్న కాంప్లెక్స్‌లో 31 టీబీ సైజులో ఉన్న ఫైల్స్ ఉన్నాయని, అందులో అమెరికా ప్రభుత్వపు అవినీతి సమాచారం ఉంద’ని ఆ ట్వీట్‌లో జూన్ 8న పేర్కొన్నాడాయన. ఆ తర్వాత వారానికి ఆయన చనిపోయాడు. మెక్‌అఫీ చనిపోయిన రెండు రోజులకే 55 అపార్ట్‌మెంట్‌లతో కూడిన మియామీ బిల్డింగ్‌లో 55 అపార్ట్‌మెంట్ల భాగం కుప్పకూలింది. దీంతో ఆయన చావుకి.. ఆ దుర్ఘటనకు సంబంధం ఉందనే వాదన తెరపైకి వచ్చింది.
ట్వీట్ ఫేక్? డిలీట్ చేశారా?
నిజానికి మెక్‌అఫీ ఆ ట్వీట్ 2019లో చేశాడనేది కొందరి వాదన. ‘ప్రభుత్వ అవినీతికి సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. సీఐఏలో ఉన్న అవినీతి ఏజెంట్, ఇద్దరు బహైమన్ అధికారుల పేర్లతో ఆ చిట్టాను రిలీజ్ చేస్తా. నేను కనిపించకుండా పోయినా.. అరెస్టయినా 31 టెర్రాబైట్స్ ఉన్న డేట్.. మీడియాకు రిలీజ్ అవుతుందని చెబుతూ 2019లో ఓ ట్వీట్ చేశాడని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని జాన్ సిల్వా ఎన్‌బీసీటీ ట్విటర్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. అలాగే కుట్ర కోణంలో ఎలాంటి ధృవీకరణ లేదని, అసలు ఆ అపార్ట్‌మెంట్‌లో మెక్‌అఫీకి ఎలాంటి అపార్ట్‌మెంట్ లేదని వెల్లడించాడు. అయితే 2020కి ముందు మెక్‌అఫీ అకౌంట్‌లోని ట్వీట్లన్ని డిలీట్ అయ్యి ఉన్నాయి. మరి అవి ఆయన డిలీట్ చేశాడా? లేదంటే నిజంగానే ఎవరైనా ఇన్‌వాల్వ్ అయ్యారా? నిజంగానే కుట్ర కోణం ఉందా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది.
ఐదు మృతదేహాల వెలికితీత
ఇక మియామీ అపార్ట్‌మెంట్‌లో ఓ పోర్షన్ కుప్పకూలిన ఘటనలో ఐదు మృతదేహాలను రెస్క్యూ టీంలు వెలికితీశాయి. మరో 156 మంది ఆచూకీని నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేకపోయినా.. భూమిలో సముద్రపు అలల వల్ల పునాదులు కొట్టుకుపోయాయని గతంలో నివేదికలు ఇచ్చాయని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రమాదపు కారణాల్ని దృవీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment