ప్రతికాత్మక చిత్రం
చెప్పింది వినకుండా పిల్లలు మారాం చేసినప్పుడు.. ఫలానా కొనిస్తాం లేదంటే ఫలానా దగ్గరికి తీసుకెళ్తాం అంటూ బుజ్జగిస్తుంటారు పేరెంట్స్. ఈరోజుల్లో పిల్లల పాలిట సెల్‌ఫోన్ ఒక వ్యసనంగా మారింది. ఆ అలవాటు మాన్పించే ప్రయత్నాలు ఎన్ని ఉన్నా.. పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. ఈ తరుణంలో ఓ తల్లి చేసిన పని.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఆరేళ్ల కిందట.. మిన్నెసోటా(అమెరికా)కు చెందిన 12 ఏళ్ల పిలగాడు సివెర్ట్ క్లెఫ్‌సాస్ ఇంట్లో ఉన్న మొబైల్‌కు అతుక్కుపోవడం మొదలుపెట్టాడు. కొడుకును ఎలాగైనా ఆ వ్యసనానికి దూరం చేయాలని తల్లి లోర్నా గోల్డ్‌స్ట్రాండ్ భావించింది. ఇందుకోసం కొడుకుతో ఓ ఛాలెంజ్ చేసింది. బహుశా ఏ తల్లికి ఇలాంటి ఐడియా వచ్చి ఉండదేమో.!
ఆరేళ్ల పాటు సోషల్ మీడియాకు గనుక దూరంగా ఉంటే.. సివెర్ట్ 18వ పుట్టినరోజున 1,800 డాలర్లు (మన కరెన్సీలో లక్ష 36 వేల రూపాయలు) ఇస్తానని ఛాలెంజ్ విసిరింది. అంత చిన్న వయసులో అంత పెద్ద ఫిగర్ వినేసరికి సివెర్ట్ టెంప్ట్ అయ్యాడు. తల్లి ఛాలెంజ్‌కు సై చెప్పాడు. ఆరేళ్లు గిర్రున తిరిగింది..
తల్లితో చేసిన ఛాలెంజ్‌కు కట్టుబడి ఈ ఆరేళ్లు సోషల్ మీడియా జోలికి పోలేదు ఆ కుర్రాడు. మీరు నమ్మినా.. నమ్మకపోయినా.. అదే నిజం అంటున్నాడు. రీసెంట్‌గా బర్త్‌డే 18వ పుట్టినరోజు చేసుకున్న ఆ కుర్రాడికి.. ఛాలెంజ్ ప్రకారం 1,800 డాలర్లను కొడుక్కి అందించింది లోర్నా. అంతేకాదు కొడుకు ఫొటోను తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసి.. జరిగిందంతా చెప్పింది. తన పెద్ద కూతురిలా కొడుకు కూడా సోషల్ మీడియాకు బానిస కావడం, మానసికంగా కుంగిపోవడం ఇష్టం లేకనే ఇలా ఛాలెంజ్ విసిరానని చెప్తోందామె.
ఈ ఆరేళ్ల కాలంలో తన తోటి వాళ్లెందరో స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. కానీ, తన కొడుకు మాత్రం వాటికి దూరంగా ఉన్నాడని మెచ్చుకుంది ఆ తల్లి. ఇంతకీ ఈ తల్లికి ఈ ఐడియా ఎలా తట్టిందో తెలుసా? ఓరోజు రేడియోలో 18 ఫర్ 18 ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ గురించి వినిందట. ఆ స్ఫూర్తితో కొడుక్కి ఈ ఛాలెంజ్ విసిరిందామె. ఇక ఎలాగూ కొడుకు తన ఛాలెంజ్ పూర్తి చేయడంతో.. ఇప్పుడతనికి స్వేచ్ఛ దొరికినట్లయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment