
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే కరోనాకి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి దానినే ప్రచారాస్త్రంగా మలుచుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలు నిరాశయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ రావడం కష్టమేనని అమెరికాలో కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థ మోడెర్నా తేల్చి చెప్పేసింది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం నవంబర్ 25 కంటే ముందు అనుమతులు తీసుకోబోమని ఆ సంస్థ సీఈఓ స్టీఫనె బాన్సెల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాము తయారు చేస్తున్న టీకా ఎంత సురక్షితమైనదో వెల్లడి కావడానికి నవంబర్ 25 వరకు సమయం పట్టే అవకాశం ఉందని, దాని భద్రతపై విశ్వాసం కుదిరాక వ్యాక్సిన్ డోసుల్ని మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఎఫ్‌డీఏని అనుమతులు కోరుతామని చెప్పారు.