నవంబర్‌ 1నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ | US Being Readied to Start Supply by November 1 | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 1నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ

Published Thu, Sep 3 2020 8:44 PM | Last Updated on Fri, Sep 4 2020 3:12 AM

US Being Readied to Start Supply by November 1 - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వీ అనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అయితే, అది ఇంకా బయటి మార్కెట్లోకి రాలేదు. అంతేగాక, దానిపై పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచానికి ముందుగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా కూడా ముమ్మర కసరత్తులు చేస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 1 లేదంటే అంతకంటే ముందే సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్‌ని ప్రజలకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ రాష్ట్రాలకు ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అన్ని రాష్ట్రాల గవర్నర్లు వ్యాక్సిన్‌ పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: 66 రోజుల్లో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌?)

రాష్ట్రాలు, వైద్య శాఖలు, ఆస్పత్రులకు సీడీసీ వ్యాక్సిన్‌ని పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అవసరమైన వసతులపై దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ గత నెల 27న సీడీసీ డైరెక్టర్‌ రాబర్ట్‌ రెడ్‌ఫీల్డ్‌ లేఖ రాశారు. తొలి డోస్ టీకా తీసుకున్న కొన్ని వారాల తర్వాత రెండో బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. వ్యాక్సిన్‌ని ముందుగా అత్యవసర సిబ్బంది, జాతీయ భద్రతా అధికారులు, బలహీన జాతుల సభ్యులకు ఇవ్వనున్నారు. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని తన కథనంలో పేర్కొంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. (చదవండి: 'వైరస్‌ మారినా వ్యాక్సిన్‌ పనిచేస్తుంది')

కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఇది ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా 80 నగరాల్లో వివిధ ప్రయోగకేంద్రాలు 30 వేల మంది వాలంటీర్లను నమోదు చేసుకున్నాయని అస్ట్రాజెనికా కూడా వెల్లడించింది. ఈ వాలంటీర్లంతా 18 ఏళ్ల పైబడినవారేనని, వివిధ సంస్కృతులు, జాతులు, భౌగోళిక ప్రాంతాలకు చెందినవారు వీరిలో ఉన్నట్లు తెలిపింది. కాగా, ఏడు వ్యాక్సిన్‌లు హ్యూమన్ ట్రయల్స్ మూడో దశకు చేరుకున్నాయి. వీటిలో ఆక్స్‌యూనివర్సిటీ సహకారంతో అభివృద్ధి చెందుతున్న ఆస్ట్రాజెనికా, మోడెర్నా, ఫైజర్ ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement