రాణి భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
లండన్: బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్–2 అంత్యక్రియలు సోమవారం ఉదయం జరగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు 500 మందికి పైగా దేశాధినేతలు, రాజులు, ప్రముఖులు ఒక్కొక్కరుగా బ్రిటన్ చేరుకుంటున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతమంది దేశాధినేతలు ఒక్కచోట కలుస్తున్న సందర్భం ఇదే కానుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తదితరులు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. బ్రిటన్, కామన్వెల్త్ దేశాలను 70 ఏళ్లపాటు సుదీర్ఘంగా పాలించిన 96 ఏళ్ల ఎలిజబెత్–2 సెప్టెంబర్ 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
తమ ప్రియతమ రాణిని కడసారి చూసుకునేందుకు గడ్డ కట్టించే చలిలోనూ బ్రిటన్‌వాసులు బారులు తీరుతూనే ఉన్నారు. రాణి మృతికి సంతాపంగా ఆదివారం రాత్రి దేశవ్యాప్తంగా నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి ముర్ము ఆదివారం లాంకెస్టర్ హౌస్‌ను సందర్శించారు. నివాళుల పుస్తకంలో భారత ప్రభుత్వం తరఫున శోక సందేశం రాశారు. అనంతరం వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో రాణి భౌతికకాయానికి రాష్ట్రపతితో పాటు బైడెన్ దంపతులు కూడా నివాళులు అర్పించారు.
ఇలా జరుగుతుంది...
► సోమవారం ఉదయం ఆరింటికల్లా రాణి సందర్శనకు వస్తున్న సందర్శకులను నిలిపేస్తారు.
► అనంతరం తుది నివాళుల కోసం దేశాధినేతలు, ప్రముఖుల రాక మొదలవుతుంది.
► 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్ హాల్ నుంచి అధికార లాంఛనాలతో సమీపంలోని వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు.
► ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 12.15కు చారిత్రక లండన్ వీధుల గుండా రాణి అంతిమయాత్ర మొదలవుతుంది. శవపేటిక విండ్సర్ కోటకు చేరుకుంటుంది.
► అక్కడి సెయింట్ జార్జ్ చాపెల్‌లో గతేడాది మరణించిన భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. వెస్ట్‌మినిస్టర్ డీన్ ఆధ్వర్యంలో సాయంత్రానికల్లా కార్యక్రమం పూర్తవుతుంది. అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
► 10 వేల మంది పై చిలుకు పోలీసులు, వేలాది మంది సైనిక తదితర సిబ్బందితో లండన్‌లో బందోబస్తు ఏర్పాట్లు కనీవినీ ఎరగనంతటి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేసేందుకు ఒక్క సెంట్రల్ లండన్లోనే ఏకంగా 36 కిలోమీటర్ల మేరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
► అంత్యక్రియల సందర్భంగా సోమవారం కనీసం 10 లక్షల మంది లండన్‌కు వస్తారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment