అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు.. | Nikki Haley And Kamala Harris Fight In US President Elections | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు..

Published Sun, Aug 30 2020 6:30 PM | Last Updated on Sun, Aug 30 2020 7:03 PM

Nikki Haley And Kamala Harris Fight In US President Elections - Sakshi

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో  ఉ‍త్కంఠ రేపుతున్నాయి. నవంబర్‌ 3న జరిగే ఈ ఎన్నికల్లో ఓ వైపు అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌, మరోవైపు డెమోక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్ పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీదారులు వీరిద్దరూ కాగా.. భారతీయ మూలాలున్న ఇద్దరు మహిళలు ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్‌, బైడెన్ సంగతి అట్ల ఉంచితే అమెరికా ఎన్నికలు అనగానే వారిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ కాగా మరోకరు ట్రంప్‌ టీంలో ముఖ్యులు నిక్కీ హేలీ. భారతీయ అమెరికన్లు అయిన వీరిద్దరూ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళలు ఇద్దరూ సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. (గుండె పగిలింది : కమలా హారిస్)

కమలాను ఉపాధ్యక్ష పదవికి నామినేట్‌ చేస్తూ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాక ట్రంప్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు డెమోక్రాట్స్‌ ఎంచుకున్న వ్యూహంగా కమలాను విశ్లేషిస్తున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓటర్లను ఆకర్షించేందుకే జో బైడెన్ వ్యూహత్మక ఎత్తుగడ వేశారన్న వాదనా వినిపినిస్తోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం కమలా ఎన్నికను బలపరుస్తూ డెమోక్రాట్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ విభృంభణ కొనసాగుతున్నా.. ప్రచార హోరు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ట్రంప్‌నే లక్ష్యంగా చేసుకున్న కమలా.. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కమలా హ్యారీస్‌.. పోరు ట్రంప్‌కు, కమలాకా అనే రీతిలో విరుచుకుపడున్నారు. ఇక 78 ఏళ్ల బైడెన్‌కే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా.. అనారోగ్యం కారణాల కారణంగా ఆయన మధ్యలోనే పదవి నుంచి తప్పుకుండా అమెరికా అధ్యక్ష పీఠం కమలా హ్యారీస్‌కే దక్కుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

ఇక రిపబ్లిక్‌ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ. అమెరికా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తురాలు. ఐక్యరాజ్య సమితిలోనూ అమెరికా రాయబారిగా కూడా నియమితులైయ్యారు. అంతకుముందు ఆమె దక్షిణ కరోలినా గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ట్రంప్‌ బృందలో ముఖ్య పాత్ర పోషించే నిక్కీ అంతర్జాతీయ అంశాల్లో భారత్‌కు తన మద్దతను ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటారు. ఇటీవల భారత్‌-చైనా మధ్య నెలకొన్న గల్వాన్‌ లోయ వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిక్కీ బహిరంగంగా హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలోనూ భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఇక  ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించే ఆమెకు ట్రంప్‌ పెద్ద పీఠే వేస్తున్నారు. (నా తండ్రి టర్బన్‌ ధరించే వారు)


రిపబ్లిక్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలో నిక్కీ పేరును చేర్చారు. జాతీయ అంశాలపై గట్టిపట్టు పెంచుకున్న ఆమె.. మంచి వక్తగా గుర్తింపుపొందారు. అయితే డెమోక్రాట్స్‌ అనుహ్యంగా ఉపాధ్యక్ష పదవికి కమలాను నామినేట్‌ చేయడంతో.. ట్రంప్‌ వ్యూహత్మకంగా నిక్కీని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రానున్న ఎన్నికల్లో మరోసారి ట్రంప్‌ గెలిస్తే ఉపాధ్య పదవిని నిక్కీకి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమెరికా రాజకీయాల్లో ఇద్దరు భారతీయు మూలాలున్న మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి  ఉపాధ్యక్ష పదవి దక్కినా రానున్న రోజుల్లో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement